వెళ్లిన వారు వెళ్లిపోవడమే.. కొత్త నీరు సంగతేంటి జగనన్న?
ఏపీలో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు.
By: Tupaki Desk | 21 March 2025 3:00 PM ISTఏపీలో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. పదవులను వదులుకుని కూడా అధికార పార్టీలో జంప్ చేసేందుకు ఆరాటపడుతున్నారు. అయితే నేతలు అవుట్ గోయింగే కానీ, ఇన్ కమింగ్ లేకపోవడంతో పార్టీ క్యాడర్ భయపడుతోందనే వాదన వినిపిస్తోంది.
వలసల నియంత్రణకు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పార్టీ ఉనికే ప్రమాదం తెస్తోందనే కార్యకర్తలు ఆవేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీ నుంచి ఎవరు వెళ్లినా తనకు అభ్యంతరం లేదని, కొత్త నేతలను తయారు చేసుకుంటానని చెబుతున్న అధినేత జగన్ ఆ దిశగా ప్రయత్నించకపోవడం కూడా పార్టీ కేడరును అసంతృప్తికి గురిచేస్తోందని అంటున్నారు.
ఏపీలో రాజకీయం తలకిందులుగా మారుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత అధికార కూటమిలోకి వలసలు ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థలు సమీపిస్తున్న కొద్దీ ఈ పొలిటికల్ మైగ్రేషన్ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పదవులను కాపాడుకోడానికి కొందరు, రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు టీడీపీ, జనసేనలో చేరేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ దిశగా ఇప్పటికే నలుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించారు. ఇలా రాజీనామా చేసిన వారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.క్రిష్ణయ్య టీడీపీ, బీజేపీలో చేరారు. ఇక ఎమ్మెల్సీ పదవులు వదులుకున్నవారిలో మర్రి రాజశేఖర్ కు టీడీపీ లైన్ క్లియర్ చేసింది. జయమంగళం వెంకటరమణ జనసేనలో చేరారు. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత చేరిక పెండింగులో ఉంది. పక్క పార్టీ నుంచి ఆఫర్ లేకపోయినా వైసీపీని వదిలేయడానికే నేతలు ప్రాధాన్యమివ్వడం చర్చకు దారితీస్తోంది.
ఇక మహిళ కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీని వీడటంతోపాటు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నేతలు కూడా వైసీపీని వరుసగా వదిలేస్తున్నారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరడమే కాకుండా, ఏకంగా మున్సిపల్ కార్పొరేషనునే టీడీపీ ఖాతాలో వేశారు. కార్పొరేటర్లు అంతా కట్టకట్టుకుని ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో ఏలూరులో వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలా ఏలూరు ఒక్కచోటే కాకుండా చాలా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాజకీయం తారుమారు అవుతోందని చెబుతున్నారు. అయితే నేతలు వెళ్లినా, నష్టం లేదని కొత్తవారిని తయారు చేసుకుంటామని, ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహిస్తామని తొలుత చెప్పిన వైసీపీ అధిష్టానం ఆ దిశగా ప్రయత్నించడం లేదని విమర్శలు ఎదుర్కొంటోంది.
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని గతంలో మాజీ సీఎం జగన్ ప్రకటించారు. వైసీపీని తానొక్కడినే ప్రారంభించానని, మళ్లీ తానే నిర్మించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఐదేళ్ల అధికారం తర్వాత ఎదురైన ఘోర పరాభావంతో కేడర్ లో ఆ నమ్మకం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధినేత జగన్ లో నమ్మకం సడలకపోయినా, కేడర్ లో విశ్వాసం పెంచలేకపోతున్నారని అంటున్నారు. దీంతో నేతలు ఎక్కువగా వలసలకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
అయితే వలస వెళ్లిపోతున్న వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంపై వైసీపీ అశ్రద్ధ వహిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ బలమైన నేతలు ఉండటం వల్ల వలసపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే భావనే వైసీపీ అగ్ర నేతల్లో కనిపిస్తోందని అంటున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు బదులుగా మాజీ మంత్రి విడదల రజిని వంటివారు బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాతో వైసీపీ నుంచి వలసలను ఆ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
అయితే జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వంటివారి స్థానంలో ఆ స్థాయి నేతలు లేరన్న విషయాన్ని కొందరు కార్యకర్తలు ఎత్తిచూపుతున్నారు. పార్టీ ఇలానే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే రానున్న కాలంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే నేతలు అస్త్ర సన్యాసాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సలహాలిస్తున్నారు. మరి కార్యకర్తల సలహాలను వైసీపీ అధిష్టానం ఎంతవరకు పాటిస్తుందో చూడాల్సివుంది.