జగన్ పాలనే కాదు.. ప్రయోగాలు కూడా.. పొలిటికల్ చర్చ.. !
మరి వీరికి జగన్ చేసిన పాపం ఏంటి? వారిలో జయమంగళ, మోపిదేవి ఎన్నికల్లో ఓడిపోయినా.. అవంతి, ఆళ్ల గెలిచినా.. కీలక స్థానాలే అప్పగించారు కదా?!
By: Tupaki Desk | 22 March 2025 3:00 AM IST"జగన్ కారణంగానే వైసీపీకి రాజీనామా చేశా. ఆయననే నన్ను తొక్కేశాడు" అని తాజాగా చిలకలూరిపేట కు చెందిన వైసీపీ నాయకుడు(రాజీనామా చేశారు), ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వాస్తవానికి మర్రి ఈ వ్యాఖ్యలు చేయడంలో తప్పులేదు. 2019 ఎన్నికల సమయంలో ఆయన నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఎన్నారై విడదల రజనీకి ఇచ్చినప్పుడు.. జగన్ కీలకమైన హామీ ఇచ్చారు. దానిని ఆయన అమలు చేయలేకపోయారు.
మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేక పోవడం.. నిజంగానే జగన్ చేసిన తప్పు. ఇచ్చేసి ఉంటే వేరేగా ఉండేది. అలా ఇవ్వలేదు కాబట్టే.. మర్రిచేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇవ్వలేక పోయింది. ఈ కోణం లో చూసుకున్నప్పుడు.. జగన్ తప్పు కనిపిస్తుంది. కానీ, వైసీపీ నుంచి బయటకు వచ్చిన చాలా మంది నాయకులు.. కూడా ఇదే మాట చెప్పడం గమనార్హం. జయమంగళ వెంకటరమణ, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ వంటివారు సైతం.. జగన్‌పై నిందలు మోపారు.
మరి వీరికి జగన్ చేసిన పాపం ఏంటి? వారిలో జయమంగళ, మోపిదేవి ఎన్నికల్లో ఓడిపోయినా.. అవంతి, ఆళ్ల గెలిచినా.. కీలక స్థానాలే అప్పగించారు కదా?! దానికి కృతజ్ఞత లేదా? అంటే.. ప్రశ్నలే మిగులుతాయి. ఇక, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరో తీరు. పెత్తనం అంతా తనకే కావాలన్న మంకు పట్టు బాలినేనిని వైసీపీకి దూరంగా ఉంచిందన్నది వాస్తవం. రాజ్యసభకు కాదు.. మంత్రివర్గమే కావాలని కోరుకున్న మోపిదేవి మాట చెల్లకపోయే సరికి ఆయన దూరమయ్యారు.
నిజానికి తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి జగన్ అనేక మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పదవులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచివచ్చి.. వైసీపీలో చేరిన తర్వాత.. వారు వదులుకున్న ఎమ్మెల్సీలను కూడా వారికే ఇచ్చారు. కానీ, ఇప్పుడు అలానే జరుగుతోందా? ఇటీవల బీద మస్తాన్ రావు.. తన రాజ్యసభ పదవిని వదులుకున్నారు. కానీ, ఆయనకు తిరిగి రాజ్యసభ సీటు దక్కలేదు. వైసీపీలో అలా జరగలేదు కదా!
సామాజిక వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశం.. దీని వెనుక ఓటు బ్యాంకు ఉందన్న స్పృహతో జగన్ చేసిన పదవుల పంపకం పాపాలే.. ఇప్పుడు శాపాలయ్యాయా? అటు రెడ్లను పోగొట్టుకుని, ఇటు తాను ఆదరించిన వారిని దూరం చేసుకుని.. జగన్ ఏం సాధించినట్టు?! అంటే.. ప్రశ్నలు తప్ప సమాధానాలు చిక్కడం లేదు. జగన్ చేసిన పాలనే కాదు.. ప్రయోగాలు కూడా.. ఇతర పార్టీలకు పాఠంగా మారాయనే చెప్పాలి.