ప్రజలంతా వైసీపీ వైపే... ఎందుకు ఓటమి వచ్చిందో మరి ?
ప్రజలు అంతా మన వైపే అని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఆ మాట ఆయన ఎన్నికల్లో ఓడిన అతి కొద్ది రోజుల నుంచే అంటూ వస్తున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2024 3:47 AM GMTప్రజలు అంతా మన వైపే అని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఆ మాట ఆయన ఎన్నికల్లో ఓడిన అతి కొద్ది రోజుల నుంచే అంటూ వస్తున్నారు. వైసీపీ చేసిన మంచి ప్రతీ ఇంట్లో ఉందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీకి ముందుంది మంచి కాలం అని ఆయన ధీమాగా ఉంటున్నారు. తాజాగా పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ వచ్చిన జనాలను చూసి అలాంటి వ్యాఖ్యలే చేశారు
వైసీపీ మంచి చేసింది అన్నది నిజం. అయితే అది ఒక వైపే. సంక్షేమమే పరమావధిగా ఎంచుకుని వైసీపీ ముందుకు సాగింది. అదే సమయంలో అభివృద్ధిని వైసీపీ పూర్తిగా వదిలేసింది. ఈ నేపధ్యంలోనే ఓటమి పాలు అయింది.
అంతే కాదు చేసిన మంచిని చెప్పుకోలేక పోయింది అని కూడా ఉంది. సరే జగన్ భావిస్తున్నట్లుగా ప్రజలు అంతా వైసీపీ వైపే ఉన్నారు అని అనుకున్నా వారిని పోలింగ్ బూతుల దాకా తెప్పించి ఓట్లు వేయించే క్యాడర్ ఆ పని చేసిందా అన్నది కూడా కీలకమైన ప్రశ్న.
వారంతా 2019 ఎన్నికల్లో చక్కగా పనిచేశారు. 2024 వచ్చేసరికి సైలెంట్ అయ్యారు అన్న ప్రచారం సాగింది. ఈ కారణం వల్లనే ఓటమి వరించింది అని కూడా ఒక విశ్లేషణ ఉంది. అలాగే పార్టీ లీడర్లలో ఉన్న అసంతృప్తి వల్ల కూడా పార్టీ ఓటమి పాలు అయింది అని కూడా ఉంది.
ఇలా చూసుకుంటే పార్టీ వైపే అన్ని వేళ్లూ వెళ్తున్నాయి. ప్రజలలో బలం ఉండడం వేరు అది ఓట్ల కింద కన్వర్ట్ కావడం వేరు. ఎంతటి ఆదరణ ఓట్లలోకి అది జమ కాకపోతే ఓటమే వరిస్తుంది. వైసీపీకి జనాదరణ ఉందని జగన్ చెప్పుకుటున్నారు. కానీ ఆ జనాదరణ బూతుల లోకి ఓట్లుగా మారాలంటే ముందు చేయాల్సింది పార్టీని పటిష్టం చేసుకోవడం. తాను ధీమాగా ఉండడం కాదు, క్యాడర్ లో లీడర్ లో ఆ ధీమా తెప్పించడం మరి ఆ పని వైసీపీ అధినాయకత్వం చేస్తోందా అన్నదే చర్చగా ఉంది.
జగన్ ఎక్కడికి వెళ్లినా జనాలు వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆదరణ ఉంది అన్నది సబబైన మాటే కానీ జనాలు ఎపుడూ విజయానికి సూచికలు కారు, ఆ మాటకు వస్తే సిద్ధం సభలకు కానీ జగన్ బస్సు యాత్రలకు కానీ జనాలు విరగబడి వచ్చారు. కొన్ని సార్లు చూస్తే కూటమి సభల కంటే కూడా ఎక్కువగా వచ్చారు అయినా వైసీపీ ఓడింది అంటే ఏమిటి అర్థం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక వైసీపీ నిన్నటిదాకా పాలించి ఉంది కాబట్టి జగన్ తాజా మాజీ సీఎం కాబట్టి జనాదరణ అలాగే ఉండవచ్చు. దీనిని అయిదేళ్ల పాటు నిలబెట్టుకుని 2029 నాటికి జగన్ మరోసారి సీఎం కావాలీ అంటే చేయాల్సింది ఈ జనాలను చూసి మురిసిపోవడం కాదని పార్టీని అభివృద్ధి చేసుకోవడం అని అంటున్నారు. మరి దీనిని వైసీపీ అధినాయకత్వం చేసే కసరత్తు ఏమిటో.