Begin typing your search above and press return to search.

జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. వైసీపీ నేత అభిమానుల రచ్చ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతున్నా.. వైసీపీ నేతల హడావుడి.. వివాదాస్పద వైఖరికి మాత్రం చెక్ పడని పరిస్థితి.

By:  Tupaki Desk   |   13 March 2025 9:47 AM IST
జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. వైసీపీ నేత అభిమానుల రచ్చ
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతున్నా.. వైసీపీ నేతల హడావుడి.. వివాదాస్పద వైఖరికి మాత్రం చెక్ పడని పరిస్థితి. తాజాగా ఊళ్లో జరుగుతున్న జాతర సందర్భంగా కొందరు చేస్తున్న వెకిలి చేష్టల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా ఎస్ఐపై దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ రచ్చ చేసిన వారంతా వైసీపీ యువనేతకు చెందిన అభిమానులు కావటం గమనార్హం. ఈ సంచలన ఘటనకు వేదికగా మారింది విజయనగరం జిల్లా.

వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు మద్యాన్ని సేవించి అసభ్య న్రత్యాల్ని చేస్తూ.. డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యంగా వ్యవహరించారు. దీన్ని అడ్డుకున్నారు అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వల్లంపూడి మహిళా ఎస్ఐ దేవి.

ఆమెపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఆమె జుత్తు పట్టుకొని కొట్టటమే కాదు.. ఆమెను అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. దాడికి పాల్పడిన వారంతా వైసీపీ యువనేతకు చెందిన వారిగా గుర్తించారు. వీరి దాడిన నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఇంట్లోకి వెళ్లి తలదాచుకోగా.. అక్కడికి సైతం వెళ్లిన యువకులు నానా హంగామా చేశారు. ఈ దాడిని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.

ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు.. మరికొందరు ఎస్ఐలు.. కానిస్టేబుళ్లు గుడివాడకు చేరుకున్నారు. దాడికి పాల్పడిన యువకులందరూ వైసీపీ యువనేత ఇంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని.. అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయాలైన మహిళా ఎస్ఐను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆమె దగ్గర ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వీడియో క్లిప్పింగుల ఆధారంగా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లుగా సీఐ తెలిపారు. ఊళ్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.