వరుదు మీదకు గ్రీష్మ ప్రయోగం !
వైసీపీ మీద అలాగే వరుదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 11:26 PM ISTఏపీలో శాసనసభకు వైసీపీ వెళ్ళడం లేదు. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోరుతోంది. దానికి కూటమి ప్రభుత్వం ససేమిరా అనడంతో వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దీంతో శాసనమండలిలోనే వైసీపీ కనిపిస్తోంది. అక్కడ వైసీపీకి మెజార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం అక్కడ మైనారిటీలో ఉంది.
పైపెచ్చు శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో మైకు బాగానే దొరుకుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది. మండలిలో వైసీపీ తరఫున మహిళా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దూకుడు చేస్తున్నారు. ఆమె ధాటీగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది.
మంత్రులు సీనియర్లు కూడా ఆమెని అడ్డుకునే ప్రయత్నం ఒక దశలో చేయాల్సి వస్తోంది. అయితే శాసనమండలికి కొత్తగా అయిదుగురు కూటమి నుంచి గెలిచి వస్తున్నారు. అందులో టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్ర కు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు. ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్నారు.
ఆమె శాసనమండలిలో కూటమి పక్షాన గట్టిగా మాట్లాడే మహిళా నేతగా రాబోతున్నారు అని అంటున్నారు. వైసీపీ మీద అలాగే వరుదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు. బేసికల్ గా వరుదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ఆమె రాజకీయ జీవితం కూడా అక్కడే మొదలైంది.
అయితే ఆమె విశాఖకు మకాం మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసనమండలి వేదికగా మారబోతోంది అని అంటున్నారు.