అవును.. ఈసారి పోలీసుల మీదనే వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి!
తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసులపై రాళ్లదాడికి తెగబడిన వైసీపీ కార్యకర్తల వైనం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 18 March 2025 1:00 PM ISTతెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీ నేతలు.. కార్యకర్తల అత్యుత్సాహానికి సంబంధించిన ఉదంతాలు తరచూ తెర మీదకు వస్తుంటాయి. పలు సందర్భాల్లో ఈ అత్యుత్సాహం పార్టీకి.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారి.. వారిని నియంత్రించేందుకు కిందా మీదా పడుతుంటాయి. అయితే.. ఏపీలో సీన్ కాస్త తేడాగా ఉన్న పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష హోదా దక్కని వైసీపీ నేతలు.. కార్యకర్తలు కొందరు చేస్తున్న ఇష్టారాజ్య పరిస్థితులు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తరచూ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో టీడీపీ కార్యకర్తను కత్తితో నరికేసి హత్య చేసిన ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతానికి ముందు సదరు కార్యకర్త తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కట్ చేస్తే.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసులపై రాళ్లదాడికి తెగబడిన వైసీపీ కార్యకర్తల వైనం షాకింగ్ గా మారింది. తిరునాళ్లలో పోలీసులపై అనూహ్యంగా జరిగిన రాళ్లదాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాళ్ల దాడిలో గాయపడిన పోలీసుల్ని ఆసుపత్రికి తరలించారు.
రాళ్లదాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసులతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన తిరునాళ్ల వేళలోనూ జరిగిన దాడులను గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది ఇంచుమించే ఇదే సమయంలో తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు జరగటం.. అమ్మవారు పుట్టిళ్లు అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు వరకు బండ్ల ఉత్సవం సాగింది.
ఈ సందర్భంగా జరిగిన దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డీజేపీ.. పార్టీ జెండాల రంగులపైనా బ్యాన్ విధించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికి.. కత్తులతో దాడులు చేసుకోవటం లాంటి ఉదంతాలు షాకింగ్ గా మారాయి. గత ఏడాది అనుభవాల్ని పరిగణలోకి తీసుకొని మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా.. చివరకు పోలీసుల మీదే రాళ్లదాడి జరగటం.. నలుగురు పోలీసులకు గాయాలు కావటం సంచలనంగా మారింది.