Begin typing your search above and press return to search.

రాయలసీమలో రైజింగ్ లో ఉన్న పార్టీ ఏది...?

రాయలసీమ ఇపుడు ఏపీ రాజకీయాలలో అత్యంత కీలకంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 11:30 PM GMT
రాయలసీమలో రైజింగ్ లో ఉన్న పార్టీ ఏది...?
X

రాయలసీమ ఇపుడు ఏపీ రాజకీయాలలో అత్యంత కీలకంగా మారిపోయింది. మొత్తం ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో 52 సీట్లు ఒక్క రాయలసీమలోనే ఉన్నాయి. అంటే 30 శాతం సీట్లు అన్న మాట. ఈ సీట్లు జత కలిస్తే అధికారం ఎవరికైనా ఇట్టే దాఖలు పడుతుంది.

ఇక రాయలసీమ తీరు చూస్తే టీడీపీకి ఎపుడూ అందని పండుగానే ఉంటోంది. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు సీమ జిల్లాలు 1983, 1985, 1994లలో ఏకపక్షంగా మద్దతు ఇచ్చాయి. 1995 లో చంద్రబాబు సీఎం అయ్యాక సీన్ మారింది. సీమ జిల్లాలలో టీడీపీ ఎపుడూ తక్కువ సీట్లతోనే సర్దుకుపోతోంది. 1999, 2014లో అదే జరిగింది. మెజారిటీ సీట్లు 1999లో కాంగ్రెస్ గెలిస్తే 2014లో వైసీపీ గెలిచింది. ఇక 2019లో అయితే కేవలం మూడంటే మూడు సీట్లు తప్ప మొత్తం 49 సీట్లను వైసీపీ గెలుచుకుని అద్భుతమైన విజయం సాధించింది.

ఇక ఇపుడు 2024 వస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అంటే యధా ప్రకారం వైసీపీకే ఈసారి కూడా మొగ్గు కనిపిస్తోంది. కానీ 2019లో వచ్చినట్లుగా 49 సీట్లు అయితే దక్కవని అంటున్నారు కనీసంగా పది సీట్ల దాకా తగ్గుతాయని, ఆ మేరకు టీడీపీ పుంజుకుంటుంది అని అంటున్నారు. సర్వేలు కూడా అదే చెబుతున్నారు. అంతదాక ఎందుకు జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలోనే 2019లో 10కి 10 వైసీపీ గెలుచుకుంటే ఈసారి మాత్రం 8 సీట్లకే వైసీపీ పరిమితం కావాల్సి ఉంటుందట. అంటే ఇక్కడ రెండు సీట్లు కచ్చితంగా టీడీపీ ఖాతాలోకి వెళ్తాయని అంటున్నారు.

అనంతపురంలో మొత్తం 14 సీట్లు ఉంటే ఇందులో సగానికి సగం టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఈసారి కనిపిస్తున్నాయట. అంటే ఇక్కడ వైసీపీకి ఏడు సీట్లు మాత్రమే దక్కుతాయని అంటున్నారు. ఇక కర్నూల్ విషయం తీసుకుంటే ఇది కూడా వైసీపీకి కంచుకోటగానే చూడాలి. అయితే ఇక్కడ మొత్తం 14 సీట్లు ఉంటే 2019లో అన్ని సీట్లను వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా పది సీట్లను గెలుచుకుంటుంది అని అంటున్నారు. నాలుగు సీట్లు టీడీపీకి వదులుకోవాల్సిందే అని అంటున్నారు.

ఇక చిత్తూరు జిల్లా. ఇది చంద్రబాబు సొంత జిల్లా. 2019లో ఒక్క చంద్రబాబు కుప్పం తప్ప మిగిలిన పదమూడు సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి కధ ఏంటి అంటే 8 నుంచి పది సీట్లు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా నాలుగు సీట్లను టీడీపీకి వదులుకోవాల్సిందే అని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 35 సీట్ల దాకా వైసీపీ కచ్చితంగా గెలుచుకుంటుందని ఇక టీడీపీ అయితే 17 సీట్లు నికరంగా గెలుచుకుంటుంది అని అంటున్నారు.

అంటే 2019 ఎన్నికల కంటే అదనంగా 14 సీట్లు టీడీపీకి పెరుగుతాయని అంటున్నారు. ఇది నిజంగా ఆ పార్టీకి శుభవార్తగానే చూడాలని అంటున్నారు. 2014 కంటే కూడా 2024లో సీట్లు పెరుగుతాయనే అంటున్నారు. అది కూడా వైసీపీ కంచుకోటలలో ఇలా ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కోస్తా ఉత్తరాంధ్రాలో సహజంగా టీడీపీకి పట్టు ఉంటుంది కాబట్టి సులువుగా మ్యాజిక్ ఫిగర్ కి చేరువ కావచ్చు అని ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. అయితే కోస్తాలో సైతం వైసీపీ గతం కంటే బలం పెంచుకుంది కాబట్టి అక్కడ కూడా హోరా హోరీ సాగుతుంది అని మరో అంచనా ఉంది.