Begin typing your search above and press return to search.

శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ - వైసీపీ!

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ ఇంటికి పంపించకపొవడం అనే సమస్య అత్యంత చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 April 2024 2:25 PM GMT
శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ - వైసీపీ!
X

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ ఇంటికి పంపించకపొవడం అనే సమస్య అత్యంత చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు & కో చేసిన పనివల్లే నేడు ఏపీలో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారని.. నేడు వారు పడుతున్న బాద, కారుస్తున్న కన్నీరు ఊరికే పోవని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తన వయసు ఉన్న ప్రజల ఇబ్బందులు సైతం చంద్రబాబుకు అర్ధంకాకపోవడం దారుణం అని చెబుతున్నారు.

రెండు నెలలు ఇబ్బందిపెట్టినంత మాత్రాన్న... వారికి ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో తెలుసని.. అందుకున్న పెన్షన్ జగన్ పంపించింది కాదని జనం భావిస్తారని మీరు భావిస్తున్నారా అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో... నేడు సచివాలయాల వద్ద ఉదయం నుంచీ పడిగాపులు కాస్తున్న వృద్ధుల ఫోటోలు, వీడియోలతో పాటు.. అక్కడివరకూ వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వికలాంగుల ఆవేదననూ ఆవిష్కరిస్తున్నారు.

అయితే... వాలంటీర్ల సంగతి కాసేపు పక్కనపెడితే... 1.60 వేల మంది సచివాలయం స్టాఫ్ ఉన్నారని.. వారితో పెన్షన్ ఇంటివద్ద ఇప్పించొచ్చని.. మనసు ఉంటే మార్గం ఉంటుందని.. కేవలం పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టి ఆ బురద తమపై చల్లాలని జగన్ భావిస్తున్నారని.. ఖజానాలో డబ్బులు లేక ఆడుతున్న డ్రామాలు ఇవని.. పెన్షన్ డబ్బులను తమ అనునయులైన గుత్తేదారులకు పంచిపెట్టేశారని.. టీడీపీ నేతలు అటాక్ స్టార్ట్ చేశారు!

దీంతో... ఈ వ్యవహారం కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లుగా మారిందని అంటున్నారు! “వాలంటీర్లను టీడీపీ కావాలనే ఆపిందనుకో.. పేద ప్రజల సమస్యలు తెలిసని చెప్పుకునే జగన్... నిజంగానే సచివాలయం సిబ్బందితో ఇప్పించ్చొచ్చు కదా” అని ఒకరంటే... “అసలు ఈ సమస్య రావడానికి మూల కారణం ఎవరు, ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నది ఎవరు” అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ పెన్షన్స్ పేరు చెప్పి ఏపీలో ఇప్పుడు శవరాజకీయాలకు తెరలేచింది.!

అవును... పెన్షన్ మొదటి తారీఖునే రాకపోవడంతో పలువురు వృద్ధులు విషయం తెలియక పంచాయతీ ఆఫీసుల వద్దకు వెళ్లి సృహతప్పి పడిపోవడం, రాజోలు నియోజకవర్గంలో గెడ్డం నరసింహమూర్తి అనే వృద్ధుడు మృతి చెందడం.. ఇలా పలు చోట్ల పలు సంఘటనలు తెరపైకి వచ్చాయి. ఇది అత్యంత విచారకరమైన విషయమే! ఇదే సమయంలో... తాజాగా కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బకు మృతి చెందిందని చెబుతున్నారు!

దీంతో... వెంటనే ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేష్, టీడీపీ నేత బోడె ప్రసాద్ లు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబాన్ని ఓదార్చడం సంగతి కాసేపు పక్కనపెడితే... రాజకీయ విమర్శలు మొదలుపెట్టారు! ఇందులో భాగంగా... “మొత్తానికి ఒకరిని పొట్టన పెట్టేసుకున్నాడు చంద్రబాబు.. ఎంతమందిని పొట్టనపెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు” అని మృతురాలి కుటుంబ సభ్యుల వద్ద జోగి రమేష్ వ్యాఖ్యానించడంతో.. "డౌన్ డౌన్ చంద్రబాబు" అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు! దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందులో భాగంగా... శవాల వద్ద రాజకీయాలు చేయొద్దని టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ కి హితవు పలికారు. ఈమెను చంద్రబాబు పొట్టనపెట్టుకోలేదు.. జగనే పొట్టనపెట్టుకున్నాడంటూ వాళ్లూ మొదలుపెట్టేశారు. అంతా కలిసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఈ సమయంలో మరొకరు కామెంట్ చేశారు. దీంతో మృతురాలి ఇంటి వద్ద వాతావరణం కాస్తా రాజకీయ రచ్చబండ అయిపోయింది!

దీంతో... ఈ శవరాజకీయాలు అవసరమా.. చనిపోయిన కుటుంబాన్ని ఎలా ఓదార్చాలి.. వారికి ఎలా అండగా ఉండాలి.. ఇలాంటి మరణం మరొకటి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచన మానేసి.. అక్కడకు కూడా చేరి ఇలా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు.. ఆమె చావుకు మీరు కారణం అంటే, మీరు కారణం అంటూ విమర్శలు చేసుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.