ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏమిటి?...తెరపైకి సరికొత్త సమాధానాలు!
దీంతో... వాలంటీర్ వ్యవస్థ కొనసాగడం అనే విషయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2024 12:40 PM GMTఏపీలో ప్రజలు వైసీపీకి ఊహించని షాక్ ఇవ్వడంతో పాటు కూటమికి సైతం ఊహించని మెజారిటీ కట్టబెట్టారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఈ సమయలో భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ శ్రేణులపై దాడులు, ఆ నేతల పేర్లున్న శిలాపలకాలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీంతో... వాలంటీర్ వ్యవస్థ కొనసాగడం అనే విషయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు.
అవును... ఏపీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టకపోవడంతో... ఇక చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు ఏమాత్రం ఆటంకాలు ఉండవనే చర్చ ఏపీలో బలంగా వినిపిస్తుంది. దానికి తోడు కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది కూటమే కావడంతో అటు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఎన్నికల సమయంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఇచ్చిన హామీలపై చర్చ మొదలైంది.
ఏపీలో ఫలితాలు వెలువడిన వెంటనే స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్... వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థలే తమ కొంప ముంచాయని తెలిపారు. ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే ప్రజలకు - నేతలకూ మధ్య భారీ గ్యాప్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తలకూ విలువ దక్కలేదన్నట్లుగా తెలిపారు!
ఇదే సమయంలో మాజీమంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... వాలంటీర్ల వల్ల తమకూ - తమ ప్రభుత్వానికీ మధ్య గ్యాప్ ఏర్పడిందని అన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తమకు సముచిత స్థానం దక్కలేదనే విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో... ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే చర్చ బలంగా జరుగుతుంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ వారి జీతం రూ.10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొంతమంది రాజీనామా చేసినా ఇంకా 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు!
ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రధానంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందనే మాటలు కూడా ఒకవైపు నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు కంటిన్యూ చేస్తారా.. చెప్పినట్లుగానే 10,000 రూపాయల జీతం ఇస్తారా.. లేక, ఆ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన చేస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.