Begin typing your search above and press return to search.

వై నాట్ 175 కాదు వై లాస్ట్ 164

జగన్ ఇచ్చిన పవర్ ఫుల్ నినాదం తిరగబడింది. వైసీపీ రాజకీయం తల్లకిందులు అయింది

By:  Tupaki Desk   |   8 Jun 2024 2:49 PM GMT
వై నాట్ 175 కాదు వై లాస్ట్ 164
X

జగన్ ఇచ్చిన పవర్ ఫుల్ నినాదం తిరగబడింది. వైసీపీ రాజకీయం తల్లకిందులు అయింది. వై నాట్ 175 అని దూకుడు చేసిన జగన్ కి ఏ మాత్రం పాలుపోని విధంగా జనాలు తీర్పు ఇచ్చారు. అది వైసీపీ శ్రేణులకు కక్కలేక మింగలేక అన్నట్లుగానే ఉంది. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడిన్ 175 నినాదం, మరెక్కడి 11 సీట్లు అసలు ఏమైనా పొంతన ఉందా. ఇదే కదా వైసీపీ శిబిరంలో కొండంత చింత అని అంటున్నారు.

వై నాట్ 175 అని అలుపెరగని తీరున గడచిన రెండేళ్ళుగా నినదిస్తున్న వారు ఇపుడు ఆ నినాదాన్ని మరచిపోవాల్సిందే. అంతే కాదు ఆ ప్లేస్ లో వచ్చిన కొత్త నంబర్ ని ఒకటికి పదిసార్లు తలవాల్సిందే. అదే వై నాట్ 164 అన్నది. అంటే వచ్చినది గోరంత పోగొట్టుకున్నది కొండంత. మరి 164 సీట్లు ఎందుకు పోయాయి ఎలా పోయాయి అన్నదే ఇపుడు వైసీపీ ఆలోచనలు కావాలి. దాని మీదనే అంతా కూర్చుని స్టడీ చేయాలి.

జగన్ ప్రతీ సభలో వై నాట్ 175 అని నినదిస్తూ వచ్చారు. కానీ అసలు ఆ స్లోగన్ వర్కౌట్ కాలేదు. ఏ మాత్రం పని కూడా జరగలేదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి జరగకూడని దారుణ పరాభవం వైసీపీకి జరిగింది. నేల విడిచి సాము చేసిన చందం అయింది. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అడుగులు నేల మీద ఉన్నపుడే జనం మెచ్చుతారు, ఓట్లు రాలుస్తారు.

కానీ వైసీపీ 151 సీట్లు సాధించేశాక ఇంకేముంది అధికారం శాశ్వతం అనుకుంది. దాంతోనే అతి ధీమా మెదడుకు ఎక్కింది. మనం కాక ఇంకెవరు అని కూడా అనుకుంది. చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అనేసుకుంది. జనసేనను ఎవరు పట్టించుకుంటారు అని మిడిసిపాటు ప్రదర్శించింది. ఇక ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ బీజేపీలను అసలు పట్టించుకోనేలేదు

వైసీపీకి ఎదురు వచ్చే సత్తా విపక్షాలకు ఎక్కడిదీ అనుకుంది. నాలుగు గోడల మధ్యన కూర్చుని నంబర్ గేం ఆడింది. తన బుర్రకు తోచిన స్లోగన్స్ ఇచ్చుకుంది. సర్వేలు స్వపక్షీయులు వండి వారిస్తే అదే జనాభిప్రాయం అనుకుంది. చివరాఖరుకు దెబ్బ తింది. ఊహాలోకంలో విహరిస్తున్న వైసీపీని అమాంతం జనాలు తెచ్చి నేలకు పడేశారు.

కొందరైతే నేల కూడా కాదు పాతాళం అంచులకు అంటున్నారు. అదే కరెక్ట్ అని కూడా అనుకోవాలి. ఏది ఏమైనా వై నాట్ 175 అన్న స్లోగన్ పూర్తిగా కామెడీ అయిపోయింది. వై లాస్ట్ 164 అన్నదే ఇపుడు సోషల్ మీడియాకు చిక్కిన ఆయుధం అయింది. వైసీపీని ఎన్నడూ లేని విధంగా రాగింగ్ చేసేందుకు అది బ్రహాస్త్రంగా మారింది.

అయినా 175 సీట్లు జనాలు ఎలా ఇస్తారని వైసీపీ అనుకుందో అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ అయిదేళ్ళ పాలన తరువాత చూస్తే సీట్లు తగ్గుతాయి కానీ ఏ మాత్రం పెరగవు. కానీ వైసీపీ మరో 24 సీట్లు కలుపుకుంది. పోనీ ఆ కలుపుకున్న ఇరవై నాలుగు సీట్లు అయినా వచ్చాయా అంటే రానే లేదు. దాంతో వైసీపీ రాజకీయం ఎటు ఏమైపోతుంది అన్న కంగారు కలవరం శిబిరంలో పట్టుకుంది.

పోయిన 164 సీట్లను ఒక్కోటిగా పట్టుకుని సమీక్ష చేసుకోవాల్సిందే. ఎందుకు జనాలు దెబ్బేసారు అన్నది ఎంత పరిశోధన చేసినా ఒక పట్టాన తేలేది కాదు కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్ళి లెక్కలు చూడాల్సిందే. అంతే కాదు ఓడిన ప్రతీ నియోజకవర్గం ఒక కేస్ స్టడీగా తీసుకోవాల్సిందే.

అంతే తప్ప నాలుగు గోడల మధ్య కూర్చుని టీడీపీ కూటమి నుంచి వచ్చే ప్రజా వ్యతిరేకతతో అధికారం దక్కుతుంది అనుకుంటే పొరపాటే. వైసీపీ చేతిలో ఉన్న అన్ని ఆయుధాలూ అయిపోయాయని అర్ధం చేసుకోవాలి. అధికారానికి దగ్గర దారి వెతుక్కుంటే అది ఓటమి కి దారి తీసేదే అని భావించాలి.

అన్నింటి కంటే ముందు వైసీపీ ఘోర ఓటమికి కర్త కర్మ క్రియ జగన్ అని తెలుసుకుని ఆయన ముందు మారాల్సి ఉంది. పార్టీ స్థాపనలో కలసి వచ్చిన అంశాలు గెలిచి వచ్చిన అంశాలు 2014 నాటి పరిస్థితులు 2019 నాటి రాజకీయ అనుకూలత 2024లో తీవ్ర ప్రతికూలతగా మారాక ఇక వైసీపీ మళ్లీ మొదటి అడుగు నుంచే తన రాజకీయాన్ని ప్రారంభించాలి.

దానికి ఓపిక చాలా అవసరం. వైసీపీ అధినాయకత్వానికి అది ఉందో లేదో ముందు తేల్చుకోవాలి. అధికారం ఉన్న చోటనే పార్టీ నేతలు ఉంటాయి. అందువల్ల ముందున్నది వైసీపీకి ముసళ్ళ పండుగ. అయిదేళ్ళు అంటే ఏకంగ 1825 రోజులు. ప్రతీ రోజూ ఇక మీదట భారమే. అడుగులు ఒక పట్టాన కదలవు. మరి ఇది జగన్ దీక్షాదక్షతలకు అసలైన అగ్ని పరీక్షగానే చూడాల్సి ఉంటుంది.