ఇలాగైతే వైసీపీకి కష్టమే!
ఈ పరాభవం వైసీపీకి, జగన్‌కు ఓ గుణపాఠం లాంటిది. ఈ ఓటమిపై విశ్లేషణ చేసుకుని భవిష్యత్ కార్యచరణపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
By: Tupaki Desk | 8 Jun 2024 12:30 PM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన జగన్ పార్టీ.. ఈ సారి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇది ఎవరూ ఊహించని పరాభవం. పార్టీ ఏకంగా పాతాళానికి పడిపోయిందని వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ ఘోర పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోవడం లేదు. మరిన్ని సీట్లు సాధించి కాస్త గౌరవప్రదంగా ఓడితే ఆ పార్టీ శ్రేణులు ఇంతలా కుంగిపోయేవి కావు.
ఈ పరాభవం వైసీపీకి, జగన్‌కు ఓ గుణపాఠం లాంటిది. ఈ ఓటమిపై విశ్లేషణ చేసుకుని భవిష్యత్ కార్యచరణపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఇదే. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని నమ్ముతూ, అదే విషయంపై పదేపదే అరుస్తూ ఉంటే వైసీపీకి కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపిస్తున్నారు. అంతే కానీ తమపై పెళ్లుబికిన ప్రజాగ్రహాన్ని మాత్రం తెలుసుకోవడం లేదు. ఎన్నికల్లో గెలుపుపోటములు సహజం. ఓటమిని హుందాగా అంగీకరించి ముందుకు సాగాలి. అయిదేళ్ల పాలనపై ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకుని, మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి.
మరోసారి ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేయాలని ఆలోచించాలి. కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఓడిపోయానే ఎంత అరిచినా లాభం ఉండదు. తమను ఓడించింది ఈవీఎంలు కాదు ప్రజలు అని ముందుగా వైసీపీ నేతలు తెలుసుకోవాలి. లేదు ఇలాగే మొండిగా సాగుతాం.. ఈవీఎంలపైనే పడి ఏడుస్తామంటే మాత్రం వైసీపీని ఎవరూ బాగుచేయలేరనే టాక్ వినిపిస్తోంది.