జగన్ మార్పులు, చేర్పులు సరే... అసలు టెస్ట్ ఇదే...!
ఈ క్రమంలోనే మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎవరూ ఊహించ ని విధంగా.. కనీసం రాజకీయ మేధావులనాడికి సైతం చిక్కని విధంగా వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 13 Jan 2024 2:30 PM GMTఏపీ అధికార పార్టీ వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్తితిలోనూ విజయం దక్కించుకుని రెండో సారి అధికారంలోకి రావాలనేది ఈ పార్టీ వ్యూహం.ఈ క్రమంలోనే వైనాట్ 175 నినాదాన్ని భుజాలపై కి ఎక్కించుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎవరూ ఊహించ ని విధంగా.. కనీసం రాజకీయ మేధావులనాడికి సైతం చిక్కని విధంగా వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంది.
కీలకమైన కమ్మ నియోజకవర్గాలు, కాపు నియోజకవర్గాల్లోనూ మార్పులు చేసేసింది. ఇక, అతిరథులుగా పేరొందిన కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా సత్యవేడు, కోడుమూరు, గూడురు వంటి ఎస్సీ స్థానాల్లో సిట్టింగులను పక్కన పెట్టేసి.. కొత్త ముఖాలకు(వీటిలో ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు) అవకాశం ఇచ్చింది. ఇది ఒక పెద్ద లక్ష్యం.. పెట్టుకున్న వైసీపీకి తేలిక విషయం అయితే కాదు. చాలా సంక్లిష్టతతో కూడుకున్న నిర్ణయం.
పైగా ఎన్నికలకు ఇంకా మూడు మాసాల గడువు ఉండగానే తీసుకున్న నిర్ణయం. దీంతో టికెట్ దక్కని వారు.. పొరుగు పార్టీలవైపు దృష్టి పెట్టడం.. ఆయా పార్టీల్లోకి జంప్ చేయడం సహజం. అయినప్పటికీ.. ఏం జరిగినా ఇష్టమేనన్నట్టుగా వైసీపీ మార్పులు చేసింది. ఇక, ఇప్పుడు నాయకుల విషయం పక్కన పెడితే.. అసలు సమస్య వైసీపీకి అగ్ని పరీక్షగా మారనుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు కొత్తగా ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టనున్న నాయకులు.. ఏమేరకు ఆయా నియోజకవర్గాల్లో పుంజుకుంటారనేది ప్రధాన ప్రశ్న.
దీనికి తోడు.. ఆయా నియోజకవర్గాల్లో కేడర్ కూడా ప్రధాన సవాల్. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జై కొట్టిన కేడర్.. వారితోనే మమేకమైన నాయకులు.. ఇప్పుడు కొత్త నేతలకు అనుకూలంగా మారాల్సి ఉంది. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, లేదా ఎంపీ ప్రభావాన్ని తగ్గించి.. తమ వంతుగా అక్కడ పుంజుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థి పక్షం నేతల అడుగులను కూడా గమనించాలి. వారిని తట్టుకుని నిలబడాలి. ఇంకోవైపు టికెట్ దక్కని వారి నుంచి ఎదురయ్యే అసమ్మతిని కూడా తట్టుకుని ముందుకు సాగాలి. ఇది ఎలా చూసుకున్నా.. వచ్చే రెండు మాసాల్లో వైసీపీ పెద్ద పరీక్షగానే మారనుందని అంటున్నారు పరిశీలకులు.