ఏపీలో ముందస్తు ఎన్నికల మీద వైసీపీ క్లారిటీ...!
ఏపీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది.
By: Tupaki Desk | 30 Nov 2023 4:23 AM GMTఏపీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే తెలియదు కానీ మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుంది ఆ తరువాత వచ్చేది మనదే అని విపక్షాలు అంటున్నారు. మత్స్యకారుల బోట్లు దగ్దం అయిన నేపధ్యంలో వారికి ఆర్ధిక సాయం అందించడానికి విశాఖ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు నెలలు మాత్రమే వైసీపీకి టైం ఉంది అని చెప్పేశారు.
అంటే ఫిబ్రవరి ఎన్నికల మీద పవన్ ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చారు అని అనుకోవాలి. అదే విధంగా యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన సందర్భంగా లోకేష్ కూడా మూడు నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అంటే ఏపీలో కొత్త ఏడాది సంక్రాంతి పండుగ దాటడం ఏంటి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుందని ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని విపక్ష నేతలు లెక్కలేస్తున్నట్లుగా ఉంది.
కానీ వాస్తవంగా చూస్తే ముందస్తు ఎన్నికలు అన్న మాటకు ఈ దశలో అర్ధం లేదు అని అంటున్నారు. కనీసం ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే ముందస్తు అని అనవచ్చు. కానీ ఎటూ ఏప్రిల్ లో ఎన్నికలు పెట్టుకుని ఒక నెల రెండు నెలల ముందు ఎన్నికలు అంటే రాజకీయ లాభం ఏమి ఉంటుంది అన్నదే కీలకమైన ప్రశ్న. పైగా అప్పటికి చాలా దగ్గరలోకి లోక్ సభ ఎన్నికలు కూడా వస్తాయి.
సరిగ్గా ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు ప్రత్యేకంగా అసెంబ్లీకి ఉండవని అన్నారు. పార్లమెంట్ తో పాటే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని కీలకమైన సమాచారమే చెప్పారు. లోక్ సభకు సంబంధించి దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ పెద్దలు ఎపుడు ఎన్నికలకు వెళ్తారో తెలియదు అన్నారు.
అందువల్ల లోక్ సభతో పాటే ఏపీకి ఎన్నికలు ఉంటాయని అన్నారు. అంటే లోక్ సభ ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందుగా జరిపితే అపుడు దానితో పాటే ఏపీకి ఎన్నికలు ఉంటాయన్న అర్ధంలో ఆయన చెప్పుకొచ్చారు. దాంతో మూడు నెలల్లో ఎన్నికలు అన్న విపక్షాల ముచ్చట్లకు చెక్ చెప్పినట్లు అయింది.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయని సజ్జల అంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ని మరోసారి కొనసాగించాలా లేక చంద్రబాబా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. రేపు ఎన్నికల్లో ప్రజలకు ఏదో ఒక చాయిస్ ఉందని మూడవ ఆల్టర్నేషన్ లేదని ఇండైరెక్ట్ గా పవన్ మీద సెటైర్లు వేశారు. పవన్ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.
దాంతో చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని సజ్జల చెప్పేశారు. పవన్ అయితే ఎన్నికలు అయ్యాక చూద్దామని క్యాడర్ కి చెబుతున్నా టీడీపీ జనసేన కూటమిలో బాబే సీఎం అభ్యర్ధి అని రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. అదే మాటను సజ్జల కూడా అన్నారు. సో సజ్జల జనసేనాని సీఎం రేసులో లేడని చెప్పడం ద్వారా సైనికులకు చెప్పాల్సిన సందేశం చెప్పారన్న మాట.