Begin typing your search above and press return to search.

8ఏళ్ల బాలికపై హత్యాచారం... పవన్ రియాక్షన్ పై వైసీపీ ప్రశ్నలు!

నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 8ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 July 2024 11:31 AM GMT
8ఏళ్ల బాలికపై హత్యాచారం...  పవన్  రియాక్షన్  పై వైసీపీ ప్రశ్నలు!
X

నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 8ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సభ్యసమాజం తలదించుకునేలా ఈ సంఘటన ఉండటమే కాకుండా.. మైనర్లు గా ఉండగానే ఈ పిల్లల మనసుల్లో ఇలాంటి విషపు బీజాలు ఎలా మొలకెత్తుతున్నాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియా ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన పవన్... దాని గురించి చదవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని.. నేరస్థులు కూడా మైనర్లే అని అన్నారు. ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయని తెలిపారు.

ఇదే సమయంలో యువకులు మనస్సులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయి... పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నాను అని స్పందించారు. దీంతో... వైసీపీ ఈ రీయాక్షన్ పై రియాక్ట్ అయ్యింది. 8ఏళ్ల బాలికపై హత్యాచారం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును తప్పుపట్టింది.

ఇందులో భాగంగా... గత ఆదివారం 8 ఏళ్ల పాపను దారుణంగా హత్యాచారం చేసి చంపితే.. ఇంతవరకు ఆ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. నేను పేపర్ లో చదివాను అని చెప్పడం ఏంటి పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో లా & ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు? అని ప్రశ్నించింది!

కాగా... నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన బాలిక ఆదివారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఆమె సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో... ఆమె ఆచూకీ కోసం ఊరు ఊరంతా కలిసి వెతికారు.

అయినప్పటికీ పాప కానరాకపోవడంతో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆమె తల్లితండ్రులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జాగిలాలతో గాలింపు చేపట్టారు. ఈ ప్రయత్నంలో... ఆమె ముగ్గురు బాలురితో కలిసి కనిపించినట్లు గుర్తించారు. దీంతో ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా పలు దారుణాలు వెలుగు చూశాయి.

వారు చెప్పిన వివరాల ప్రకారం... గ్రామంలోని పార్క్ దగ్గరకి ఆడుకోవడానికి వచ్చిన బాలికను.. ఆ ముగ్గురు మైనర్లూ సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పేస్తుందేమోనని భయపడి.. చివరికి ఆమెను హత్యచేసి కాలువలో పడేసినట్లు చెప్పారు! దీంతో బాలిక కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. ఈ ముగ్గురు మైనర్లనూ ఆరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.