Begin typing your search above and press return to search.

వైసీపీలో ధీమా పెరిగిందా...!?

రాజకీయాల్లో ఎపుడూ చలనం ఉంటుంది. అది నిరంతర ప్రవాహం లాంటిది ఎత్తులు పల్లాలు లోతులూ అన్నీ కూడా ఉంటాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 4:30 PM GMT
వైసీపీలో ధీమా పెరిగిందా...!?
X

రాజకీయాల్లో ఎపుడూ చలనం ఉంటుంది. అది నిరంతర ప్రవాహం లాంటిది ఎత్తులు పల్లాలు లోతులూ అన్నీ కూడా ఉంటాయి. వ్యూహాలు అందరూ వేస్తారు కానీ ఫలించేది కొన్ని మాత్రమే. పొత్తులు అన్నవి సక్సెస్ ఫుల్ ఫార్ములా అవవచ్చు, కాకపోవచ్చు. ఆయా పార్టీలలో ఉన్న పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితుల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉంటే ఏపీలో అధికార వైసీపీ మేము తప్పకుండా గెలుస్తామని అంటోంది. సిద్ధం సభలను వరసగా నిర్వహించుకుంటూ వస్తోంది. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. అయితే విపక్ష కూటమి మీద కూడా వైసీపీ ఒక కన్నేసి ఉంచింది. విపక్షం ఎంత బలంగా ఉంది అన్నది కూడా అధికార పార్టీ ఎప్పటికప్పుడు గమనించుకుంటోంది.

ఎందుకంటే విపక్షం ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువగా ఇబ్బందులు వస్తాయన్నది అధికార పక్షం ఆలోచన. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు విపక్షంలో పొత్తుల ఎత్తులు ఎంత బలంగా ఉన్నాయన్నది వైసీపీ ఎప్పటికపుడు లోతుగానే అధ్యయనం చేస్తూ వస్తోంది. జనసేన బలం అన్నది ఒక బలమైన సామాజిక వర్గం వద్ద ఉంది. అందువల్ల ఈ పొత్తులు ఫలిస్తే ఆ సామాజిక వర్గం ఆలోచనలు కూడా మారి ఓటింగ్ మరో మలుపు తిరుగుతుందని లెక్కలు ఉన్నాయి.

ఇపుడు కనుక చూసుకుంటే పొత్తుల వల్ల ఇబ్బందులే ఉన్నాయని అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల నుంచి అంతా ఊహించినట్లుగానే జనసేన టీడీపీ పొత్తు కొంత అసహజమైన తీరులోనే సాగుతోందని కూడా అంటున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగడం అన్నది ఎపుడూ జరగలేదు. ఇక రెండు ప్రాంతీయ పార్టీలు ఒకే రీజియన్ లో బలంగా ఉన్నపుడు కూడా పొత్తుల వెనక కత్తులు దూసుకోవడం జరుగుతుంది.

ఇక రెండు బలమైన సామాజిక వర్గాలు పోటీ పోటీగా ఉన్న నేపధ్యం నుంచి వాటికి సంబంధించిన పార్టీలు ఎన్నికల వేళ సయోధ్య నెరిపినా వాటి ఫలితాలు పూర్తిగా అందవు అన్నది కూడా మరో విశ్లేషణ. ఇలా ఏ విధంగా చూసుకున్నా టీడీపీ జనసేనల మధ్యన పొత్తు ఇబ్బంది అవుతుంది అనే అనుకున్నారు. ఇపుడు అదే జరుగుతోంది అని అంటున్నారు.

ఏకంగా 118 సీట్లకు టీడీపీ జనసేన అభ్యర్ధులను ప్రకటించామని ఆర్భాటం చేశారు కానీ వాటి తరువాత వచ్చిన ప్రకంపనలు మాత్రం చాలానే ప్రభావం చూపిస్తున్నాయి. ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం జనసేనకు ఇచ్చిన 24 సీట్ల పట్ల మండిపోతోంది. ఏపీ నుంచి అమెరికా వరకూ ఆ సామాజిక వర్గం ఒక్కటే ఆవేశం ప్రదర్శిస్తోంది. ఇలా జరుగుతుందని అనుమానం ఉందని ఇపుడు అదే జరిగిందని కూడా విమర్శలు చేస్తోంది.

ఈ నేపధ్యంలో నుంచి చూస్తే ఓట్ల బదిలీ అన్నది అటు నుంచి ఇటు జరుగుతుందా అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉంది. అయితే నచ్చెచెప్పడాలు, బుజ్జగించడాలు వంటివి ఉంటాయి. అయితే అవన్నీ కూడా నేతల స్థాయిలోనే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ కి మాత్రం ఒక సంకేతం అయితే వెళ్ళిపోయింది. దాంతోనే ఇపుడు అనుకున్నది కాస్తా వికటిస్తుందా అన్న భయాందోళనలు రెండు పార్టీలలో ఉన్నాయి.

అదే సమయంలో చూసుకుంటే టీడీపీ కంటే జనసేన ఎమోషనల్ పార్టీగా ఉంటుంది. అక్కడ భావోద్వేగాలు చాలా ఎక్కువ. రాజకీయం కంటే కూడా అక్కడ ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తుంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని తెలిసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీలోనే సర్దుబాట్లు సరిగ్గా లేవు. కంప్లీట్ గా ఎమోషనల్ బాండేజ్ తో నిర్మితం అయిన జనసేనలో అయితే ఇలాంటి వాటి విషయంలో అసలు కుదరవు అనే అంటున్నారు.

ఈ పరిణామాలు ఇబ్బందిని కలిగించేవే అని అంటున్నారు. దాంతోనే వైసీపీలో ఇపుడు గెలుపు ధీమా మరింతగా పెరిగింది అని అంటున్నారు. ఆ పార్టీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే జనసేన టీడీపీ లిస్టులు ఎన్ని రిలీజ్ చేస్తే మాకెందుకు మా విజయం ఖాయం అయిపోయింది అని బల్ల బుద్ది మరీ చెబుతున్నారు. జనసేనకు ఇచ్చిన సీట్లు చూస్తే ఆ పార్టీ విలువ ఏమిటో చంద్రబాబు లెక్క కట్టారని ఎకసెక్కమాడారు.

ఇక జనాలు కూడా జనసేన అవసరమా అన్నది ఎన్నికల్లో తేల్చి చెబుతారు అని బొత్స అంటున్నారు. ఏది ఏమైనా విపక్ష కూటమిలో గందరగోళం పొత్తుల ఎత్తులలో వస్తున్న ఇబ్బందులు, బీజేపీ ఈ రోజుకీ కలవని వైనం ఇవన్నీ కూడా అధికార పక్షానికి సహజంగానే లాభించే అంశాలు. ఆ లెక్కలు చూసుకునే వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు.