పాత వ్యూహంతో కొత్తగా టీడీపీతో వైసీపీ !
ప్రత్యేక హోదా అంటే కేంద్రంలోని బీజేపీకి ఇబ్బంది ఉండాలి. కానీ చిత్రంగా టీడీపీకి తంటాగా మారుతోంది.
By: Tupaki Desk | 22 July 2024 3:26 AM GMTప్రత్యేక హోదా అంటే కేంద్రంలోని బీజేపీకి ఇబ్బంది ఉండాలి. కానీ చిత్రంగా టీడీపీకి తంటాగా మారుతోంది. దేశంలోని మూడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. అందులో రెండు విపక్షంలో ఉన్నవి అయితే ఒకటి అధికార ఎన్డీయేతో మిత్రుడిగా ఉంటూనే హోదా కోసం పట్టుబడుతోంది.
బీహార్ లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ప్రత్యేక హోదా స్టాండ్ అలాగే ఉంచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జేడీయూ ప్రత్యేక హోదా నినాదాని వినిపించింది. ఆలాగే ఒడిషా నుంచి బిజూ జనతాదళ్ సైతం ప్రత్యేక హోదా కోరింది.
ఏపీ నుంచి వైసీపీ ప్రత్యేక హోదా అంటోంది. ఇదే సమయంలో టీడీపీ మాత్రం ఆ డిమాండ్ ని పెట్టలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తోంది. అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా కోరుతూంటే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి అత్యంత కీలక మద్దతుదారురాలిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా కోరకపోవడం ఏమిటి అని ఆక్షేపిస్తోంది.
ఇక వైసీపీకి ఇదే చాన్స్ అన్నట్లుగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. టీడీపీకి వైసీపీ డైరెక్ట్ ప్రత్యర్ధి. అలాగే పొరుగున ఉన్న ఒడిషా సైతం ఇదే డిమాండ్ చేయడం, బీహార్ లోని సాటి ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ కూడా ప్రత్యేక హోదా అడగడం ఇబ్బందుల్లో పడేలా చేస్తోంది.
జేడీయూ గట్టిగా అడుగుతూంటే టీడీపీ ఎందుకు ఆ పని చేయదని కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ గతంలో ఎలా ఉన్నా ఇపుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం ద్వారా ఒడ్డున ఉంది. దీంతో టీడీపీ కార్నర్ అయ్యేలా ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదాను డిమాండ్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత ఎక్స్ వేదికగా టీడీపీ మీద సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటుందని భావిస్తున్నట్లుగా చెప్పారు.
అంటే ఎన్డీయేతో బంధాన్ని టీడీపీ తెంచుకోవాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే వ్యూహాన్ని వైసీపీ అమలు చేసింది. చివరికి టీడీపీ అలాగే చివరి ఏడాది తప్పుకుంది. ఇపుడు అదే స్ట్రాటజీని వైసీపీ ఉపయోగిస్తోంది. అయితే టీడీపీ ఈసారి ప్రత్యేక హోదా అన్న డిమాండ్ నే పెట్టడం లేదు.
కానీ ఏపీలో విపక్షాలు ఈ అంశాన్ని ప్రజలలో పెట్టి వారి మద్దతు కూడగట్టే దానిని బట్టే టీడీపీ మీద ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రత్యేక హోదా నినాదం మాత్రం మరోసారి ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది అని అంటున్నారు. బీజేపీ అయితే ఈ డిమాండ్లను ఏ విధంగా చూస్తోందో తెలియదు కానీ ఏపీలో ప్రజలకు ఇది సెంటిమెంట్ గా మారితేనే టీడీపీకి బిగ్ ట్రబుల్ అని అంటున్నారు.