Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా...వైసీపీకి నో చాన్స్ ?

వైసీపీకి ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ పార్టీ అధికారంలో అయిదేళ్ల పాటు ఉంది.

By:  Tupaki Desk   |   7 July 2024 5:52 PM GMT
ప్రత్యేక హోదా...వైసీపీకి నో చాన్స్ ?
X

ఏపీలో ప్రత్యేక హోదాను మరోసారి గట్టిగా రగిలించబోతున్నారు. హోదాని సాన పడితే అందులో రాజకీయ లాభాలు కూడా ఉంటాయి. వాటిని 2019లో వైసీపీ పూర్తిగా ఎంజాయ్ చేసింది. ఇపుడు మరోసారి హోదా ఉద్యమాన్ని చేపట్టాలని వైసీపీ భావిస్తోందా అంటే ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు.

వైసీపీకి ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆ పార్టీ అధికారంలో అయిదేళ్ల పాటు ఉంది. తాను అధికారంలో ఉన్న కాలంలో ప్రత్యేక హోదా గురించి కేంద్రం వద్ద గట్టిగా డిమాండ్ చేయలేదు అన్న విమర్శలను మూటకట్టుకుంది. లోక్ సభలో బండ మెజారిటీ బీజేపీకి ఉంది అని వైసీపీ తప్పించుకున్నా రాజ్యసభలో మెజారిటీ లేని సమయంలో ఉదారంగా మద్దతు ఇచ్చింది కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కండిషన్ పెట్టలేదని మిగిలిన పార్టీలు అపుడూ ఇపుడూ ఆక్షేపిస్తూనే ఉన్నాయి.

ఇక 2014 నుంచి 2019 దాకా హోదా ఉద్యమాన్ని వైసీపీ భుజానికి ఎత్తుకుంది. దాని ప్రతిఫలాన్ని కూడా పొందింది. ఇపుడు మళ్లీ ఆ నినాదం ఎత్తుకుంటే పొలిటికల్ మైలేజ్ అటుంచి జనాలు విశ్వసిస్తారా అన్న సందేహాలు ఉన్నాయి.

అలాగే హోదా డిమాండ్ ని ఎత్తుకుంటే ఎపుడు ఎత్తుకోవాలి ఏ సమయంలో ఎత్తుకుంటే బాగుంటుంది అన్నది కూడా వైసీపీలో అంతర్మధనం సాగుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఈ డైలామాలో ఉండగానే వామపక్షాలు మాత్రం తన డెసిషన్ చెప్పేశాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని సీపీఐ సీపీఎం అంటున్నాయి. ఏపీకి ఆర్ధికంగా ఎంత ప్రయోజనం కలిగించినా అవి హోదా సాటికి రావు అని వామపక్ష నేతలు అంటున్నారు. పైగా అవన్నీ విభజన హామీలుగా చట్టంలో ఉన్నది ఉన్నట్లు చేయాల్సినవే తప్ప కొత్తవి కావు అని అంటున్నారు.

అదే హోదా విషయం అయితే ఏపీకి జీవంగా ఉంటుందని ఏపీ దశ తిరుగుతుందని కూడా అంటున్నాయి. అందుకే తాము హోదా కోసం ఉద్యమించి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ గతంలో హోదా మీద పల్లెత్తు మాట అనలేదని అంటూ వైసీపీని దూరం పెడుతున్నాయి.

మరో వైపు కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీది ఇదే స్టాండ్ తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారు కూడా పైగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు రెండూ ఉన్నాయి. దాంతో ఈ పార్టీలు కలసి ఉమ్మడిగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేపడతాయా అన్న చర్చ సాగుతోంది. అలా చేస్తే కనుక ఏపీలో హోదా ఉద్యమం గట్టిగానే సాగే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో వైసీపీకి ఒక ఆయుధంగా మారుతుంది అనుకుంటున్న ప్రత్యేక హోదా ఆ పార్టీ నుంచి చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. హోదా అన్నది సెంటిమెంట్. అది కనుక గట్టిగా రాజుకుంటే జనాలు ఆయా పార్టీల వైపు చూస్తారు. రేపటి రోజున జాతీయ స్థాయిలో అధికారం చేపట్టగలితే సత్తా ఉన్న ఇండియా కూటమి హోదా పోరాటాన్ని మొదలెడితే మాత్రం ఏపీలో రాజకీయంగా భారీ నష్టం వైసీపీకి తప్పదు అని అంటున్నారు.

వైసీపీ హోదా మీద ఏమి ఆలోచిస్తోంది ఆ పార్టీ స్టాండ్ ఏంటి అన్నది తెలియడం లేదు. పార్లమెంట్ లో మాత్రం వైసీపీ ఎంపీలు హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మొత్తం మీద ఏపీలో హోదా ఉద్యమం రాజుకుంటే అది విపక్షల మధ్య ఐక్యతను పెంచుతుందా లేక వైసీపీని ఒంటరిని చేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తున్న మరో విషయంగా ఉంది.