Begin typing your search above and press return to search.

ఇద్దరిపైనా వేటు తప్పదా ?

దాని ప్రకారమే ఇపుడు ఛైర్మన్ ఎంఎల్సీలను విచారించారు. మంగళవారం జరిగిన విచారణే బహుశా చివరి విచారణగా అనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   6 March 2024 5:19 AM GMT
ఇద్దరిపైనా వేటు తప్పదా ?
X

ఇద్దరు రెబల్ ఎంఎల్సీలపైన వేటు తప్పదని అర్ధమైంది. వైసీపీ తరపున ఎంపికైన ఇద్దరు ఎంఎల్సీలు సీ రామచంద్రయ్య, చెల్లుబోయిన వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ టీడీపీ, జనసేనలో చేరారు. వంశీ జనసేనలో చేరగా, రామచంద్రయ్య టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇద్దరికీ సుమారుగా చెరో నాలుగేళ్ల పదవీకాలం ఇంకా ఉంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరు అనర్హత వేటును ఎదుర్కోబోతున్నారు. వీళ్ళిద్దరిని పదవులకు అనర్హులుగా చేయాలని వైసీపీ నుంచి శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు విజ్ఞప్తి అందింది.

దాని ప్రకారమే ఇపుడు ఛైర్మన్ ఎంఎల్సీలను విచారించారు. మంగళవారం జరిగిన విచారణే బహుశా చివరి విచారణగా అనుకుంటున్నారు. అందుకనే తొందరలోనే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటుపడటం ఖాయమని అర్ధమవుతోంది. ఎందుకంటే వైసీపీ తరపున ఎంఎల్సీలుగా ఎంపికైన వీళ్ళు టీడీపీ, జనసేనలోకి ఫిరాయించిన మాట వాస్తవం. పార్టీలు మారడం అన్నది నేతల ఇష్టమనటంలో సందేహం లేదు. అయితే ఏ పార్టీ తరపున అయితే తమకు పదవులు దక్కాయో వాటికి రాజీనామా చేయటం అన్నది సదరు నేతల కనీస ధర్మం. అయితే ఇపుడు అలాంటి ధర్మం, న్యాయాన్ని ఎవరు పాటించటంలేదు.

అందుకనే అనర్హత పిటీషన్లు స్పీకర్, ఛైర్మన్లకు అందుతున్నాయి. స్పీకర్, ఛైర్మన్ విచారణ జరిపి వేటు వేయాల్సొస్తోంది. టీడీపీ హయాంలో ఫిరాయింపులపై అనర్హత వేటు పడలేదు. ఇపుడు వైసీపీ హయాంలో మాత్రం ఎనిమిది ఎంఎల్ఏల మీద ఈమధ్యనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనాలు మరచిపోకముందే ఇద్దరు ఎంఎల్సీలు అనర్హత విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటుపడటం ఖాయమట.

ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేసినా వేయకపోయినా పెద్దగా లాభనష్టాలు లేవు. ఎందుకంటే ఎన్నికలు తొందరలోనే జరగబోతున్నాయి కాబట్టి. అదే ఎంఎల్సీల మీద అనర్హత వేటు వేస్తే అధికారపార్టీకి లాభముంటుంది. ఎందుకంటే వీళ్ళపైన అనర్హత వేటు వేసి అదే విషయాన్ని శాసనమండలి కేంద్ర ఎన్నికల కమీషన్ కు చెబుతుంది. ఈ రెండు స్ధానాల భర్తీకి కమీషన్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. అప్పుడు ఆ ఖాళీలను వైసీపీ మరో ఇద్దరు నేతలతో భర్తీ చేసుకుంటుంది. వీళ్ళమీద వేటుపడగానే పదవులను అందుకోబోయే ఇద్దరు లక్కీనేతలు ఎవరో చూడాలి.