Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కాంగ్రెస్ బిగ్ షాట్...?

కొత్త ముఖాన్ని బరిలోకి దించడం ద్వారా ఆముదాలవలసను తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని తెలుస్తోంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:16 AM GMT
వైసీపీలోకి కాంగ్రెస్ బిగ్ షాట్...?
X

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస సీటుని మరోసారి గెలవాలని వైసీపీ చూస్తోంది. అందుకోసం సమర్ధులైన అభ్యర్ధుల వేట సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కం స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం కి ఈసారి సీటు దక్కడం డౌట్ అని అంటున్నారు. ఆయన పట్ల నియోజకవర్గం వైసీపీలోనే వ్యతిరేకత పూర్తిగా ఉందని అంటున్నారు. అలాగే ప్రజలలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో కొత్త ముఖాన్ని బరిలోకి దించడం ద్వారా ఆముదాలవలసను తన ఖాతాలో వేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని తెలుస్తోంది. దానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను ఇటీవల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఈ వ్యూహంలో భాగమని అంటున్నారు.

బొడ్డేపల్లి వారసులను పార్టీలోకి తెచ్చి ఆముదాలవలస నుంచి పోటీ చేయించాలన్నది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. బొడ్డేపల్లి రాజగోపాల్ కోడలు ఆయన రాజకీయ వారసురాలు అయిన బొడ్డేపల్లి సత్యవతిని వైసీపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతుననరు. ఆమె 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక విభజన అనంతరం 2014, 2019లలో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఒకసారి నాలుగు వేలు, మరోసారి 900 ఓట్లు మాత్రమే దక్కాయి. అయినా ఆమె కాంగ్రెస్ ని వీడకుండా పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమెని జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆమె పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమె ఆముదాలవలస నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

అయితే ఆమెను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తీఎసుకుని రావడం ద్వారా బొడ్డేపల్లి రాజగోపాల్ లెగసీని పూర్తి స్థాయిలో వాడుకోవాలని వైసీపీ చూస్తోంది. అనేక దఫాలుగా రాజగోపాల్ ఎంపీగా శ్రీకాకుళం నుంచి నెగ్గి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు. ఆయన పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని వైసీపీ ఆయన శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించింది. ఇపుడు కోడలుకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఆముదాలవలస నుంచి విజయం సాధించవచ్చు అని భావిసోంది.

ఈ మేరకు బొడ్డేపల్లి సత్యవతితో సంప్రదింపులు జరిగాయని, రాయబారాలు కూడా సాగాయని అంటున్నారు. మరి ఆమె వైపు నుంచి స్పందన ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ బొడ్డేపల్లి సత్యవతి వస్తే మాత్రం టీడీపీకి ఇక్కడ చెక్ పెట్టగలమని ఆ పార్టీ అంచనా కడుతోంది. ఇక తమ్మినేని సీతారాం స్వయంగా బొడ్డేపల్లి శతజయంతి ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను మోశారు.

ఆయన సత్యవతి పోటీకి ఓకే చెబుతారా అంటే ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. తమ్మినేని వ్యతిరేక వర్గం మాత్రం కొత్త ముఖం ఎవరైనా తమకు ఓకే అంటున్నారు. తమ్మినేని అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. ఆయనకు నచ్చచెప్పి ఎంపీగా పోటీ చేయిస్తే రెండిందాలా వైసీపీకి లాభం అన్న లెక్క అయితే పార్టీ పెద్దలు వేసుకుంటున్నరు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.