Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని గురించి జగన్ కీలక వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో కీలకమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ నెలలో విశాఖ నుంచి పాలన చేపడతామని స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 7:48 AM GMT
విశాఖ రాజధాని గురించి జగన్ కీలక వ్యాఖ్యలు!
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో కీలకమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరలో అంటే డిసెంబర్ నెలలో విశాఖ నుంచి పాలన చేపడతామని స్పష్టం చేశారు. విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి విశాఖ రాజధాని గురించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసుకుని డిసెంబర్ నుంచి విశాఖలో పాలన చేపడతామని జగన్ చెప్పుకొచ్చారు. విశాఖను ఆయన పొగడడం విశేషం. విశాఖ వంటి నగరం వేరేది లేదు అన్నారు. విశాఖ అద్భుతమైన నగరం అంటూ కీర్తించారు. విశాఖ ఏపీలోనే నంబర్ వన్ అన్నారు. అంతే కాదు దేశంలోని అనేక ప్రధాన పట్టణాలతో పోలిస్తే రెండవ శ్రేణి నగరంగా విశాఖను చెబుతారని, కానీ విశాఖ మాత్రం ఏ విధంగా చూసినా అగ్ర స్థానంలోనే ఉంటుందని జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ నుంచి పరిపాలన చేయడం అంటే తనకు ఎంతో గర్వకారణం అని జగన్ చెప్పుకున్నారు. విశాఖకు అన్ని హంగులూ ఉన్నాయని జగన్ అంటూ బ్యూటీఫుల్ సిటీగా పేర్కొన్నారు. విశాఖ ఏపీకి భవిష్యత్తు అని కూదా జగన్ అభివర్ణించారు. విశాఖలో ఇన్ఫోసిస్ కంపెనీ అడుగు పెట్టడం ఐటీ భవిష్యత్తుకు ఒక మంచి సంకేతంగా చూడాల్సి ఉంది అన్న్నారు.

ఇక ఏపీ కన్న కలలు సాకారం కావాలంటే విశాఖ మాత్రమే ఒక కీలకమైన గమ్యస్థానం అని జగన్ అంటున్నారు. విశాఖకు మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలు వస్తాయని అన్నారు. విశాఖ రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే అతి ముఖ్య నగరం అన్నారు. విశాఖ ఎంతలా అభివృద్ధి చెందితే అంతలా ఏపీకి అది ఉపయోగపడుతుందని అన్నారు.

ఇదిలా ఉండగా విశాఖను ఎంతగానో పొగిడిన జగన్ తన పాలనను డిసెంబర్ నుంచి మొదలుపెడతాను అని చెప్పడానికి కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం అమరావతి రాజధాని మీద కేసు విచారణ పెండింగులో ఉంది. ఇది డిసెంబర్ లో విచారణకు వస్తుంది. ఆ నెలలో ఏదైనా కోర్టు నుంచి రిలీఫ్ పొంది పూర్తి స్థాయిలో రాజధానిగా ప్రకటించి మరీ జగన్ రాజమార్గంలోనే వస్తారని అంటున్నారు.

అందుకే ఇటీవల విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అయితే తమ ముఖ్యమంత్రి జగన్ దర్జాగానే విశాఖలో అడుగుపెడతారని, దొడ్డి తోవలలో రావాల్సిన అవసరం అగత్యం తమకు లేవని అన్నారు. మొత్తానికి జగన్ చెబుతున్న డిసెంబర్ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. ఆనాటికి సుప్రీం కోర్టులో ఎంతో కొంత సానుకూలత రాజధాని విషయంలో వస్తుందని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

సో జగన్ విశాఖ పాలన అక్టోబర్ నుంచి మరో రెండు నెలలు వెనక్కి జరిగింది. ఇది కొంత నిరుత్సాహం కలిగించేది అయినా డిసెంబర్ లో మాత్రం పక్కా అని అంటున్నారు. సుప్రీం కోర్టులో విచారణను బట్టి వైసీపీ ఇక తుది నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు కూడా ఎంతో దూరంలో ఉండవు కాబట్టి అది అనివార్యం అని అంటున్నారు.