మాకు.. చంద్రబాబుకు అదే తేడా: సీఎం జగన్
ఈ సందర్భంగా ఆయన జగనన్న చేదోడు పథకం కింద వరుసగా నాలుగో ఏడాది లబ్ధి దారులకు రూ.10 వేల చొప్పున వారికి అకౌంట్లలోకి బటన్ నొక్కి నగదు విడుదల చేశారు
By: Tupaki Desk | 19 Oct 2023 8:53 AM GMTతమ పాలనకు, గత చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వ తమదని, ఇచ్చిన మాటను పక్కన పెట్టే ప్రభుత్వం చంద్రబాబుదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనకు.. ప్రస్తుత తమ పాలనకు తేడా చూడాలని.. మీ బిడ్డను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఎమ్మిగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన జగనన్న చేదోడు పథకం కింద వరుసగా నాలుగో ఏడాది లబ్ధి దారులకు రూ.10 వేల చొప్పున వారికి అకౌంట్లలోకి బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ.. తమ హయాంలో ఏ పథకం తీసుకున్నా.. ఈ కార్యక్రమం చేసినా.. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా చూస్తున్నామన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా తాము పాలన సాగిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపించాలనే ఉద్దేశమే ఉందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో గజదొంగల ముఠా ఒకటి ఉండేదని.. అది రాష్ట్రాన్ని దోచేసిందని జగన్ అన్నారు. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలన్నారు.
''అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పంలో కొన్ని వేల ఇళ్ల స్థలాల కేటాంయిపుతో పాటు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టింది'' అని జగన్ అన్నారు.
చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారన్న జగన్.. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేశారని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం మేనిఫెస్టో లో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని వివరించారు. చంద్రబాబు రుణమాఫీ కూడా చేయలేదన్నారు.
''మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైనే దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు.. రేపు జరగబోయే యుద్ధంలో తోడేళ్లందరూ ఏకమవుతారు. వీళ్లు చెప్పిన అబద్దాలు నమ్మకండి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా ఆలోచించండి'' అని జగన్ పిలుపునిచ్చారు.