Begin typing your search above and press return to search.

ఒకే సిటీ.. ఒకే కులానికి రెండు సీట్లు.. జగన్‌ నిర్ణయం సరైనదేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Jan 2024 2:30 PM GMT
ఒకే సిటీ.. ఒకే కులానికి రెండు సీట్లు.. జగన్‌ నిర్ణయం సరైనదేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్‌ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో కొందరు సిట్టింగులకు పూర్తిగా టికెట్లు నిరాకరించారు. మరికొంతమందిని ప్రస్తుతమున్న స్థానాల నుంచి వేరే స్థానాలకు మార్చారు. అలాగే ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు.

ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నగరం, ఆ జిల్లా కేంద్రం అయిన రాజమండ్రిలో ఉన్న రెండు సీట్లను ఒకే కులానికి కేటాయించారు. ఈ నిర్ణయంపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మిగతా కులాలకు తప్పుడు సంకేతాలను పంపుతుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తారని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాకుండా వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో మంత్రిగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం సీటును చెల్లుబోయిన వేణుకు జగన్‌ నిరాకరించారు. ఆయనకు రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని కేటాయించారు.

ఇక ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్‌ రామ్‌ ఉన్నారు. ఈయన కూడా శెట్టిబలిజ (గౌడ) సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఈసారి మార్గాని భరత్‌ రామ్‌ ను ఎంపీ అభ్యర్థిగా తప్పించి రాజమండ్రి సిటీ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్‌ ప్రకటించారు. దీంతో రాజమండ్రి నగరంలో ఉన్న రెండు సీట్లను ఒకే కులానికి జగన్‌ ప్రకటించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమండ్రిలో కాపులు, కమ్మలు, చేనేతలు, ఇతర బీసీ కులస్తులు అత్యధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగరంలో ఉన్న రెండు సీట్లలో ఒక్కటి కూడా ఈ వర్గాలకు కేటాయించకుండా రెండు సీట్లను ఒకే కులానికి కేటాయించడం పట్ల వైసీపీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే చోట ఒకే కులానికి రెండు సీట్లు ఇస్తే మిగతా కులాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.

జిల్లాలో వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఒకే కులం వారికి సీట్లు ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ.. ఒకే చోట అందులోనూ మిగతా కులాలు అత్యధికంగా ఉన్న చోట ఒకే కులానికి రెండుకు రెండు సీట్లు ఇవ్వడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్‌ నిర్ణయం సరైందో, కాదో ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.