వైసీపీ మార్పుల అంకంలో మరో ఆసక్తికర సన్నివేశం!
మరోవైపు అనకాపల్లి టికెట్ మిస్ అయిన మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు తాజాగా పార్టీ బాధ్యతల్ని అప్పగించారు
By: Tupaki Desk | 11 Feb 2024 6:31 AM GMTఏపీ అధికార వైసీపీలో నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. వైనాట్ 175 నినాదంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జగన్ పార్టీ.. అందుకు తగ్గట్లు నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. అభ్యర్థుల పరంగా.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్న జోరు పెరిగింది. ఇటీవల పార్టీ టికెట్ లభించని కొందరు నేతలకు పార్టీకి సంబంధించిన కీలక పదవుల్ని అప్పగిస్తూ శనివారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
పార్టీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు.. తిరుపతి కూడా ఉన్నాయి. అయితే.. తాజాగా వాటిని ఆయన వద్ద నుంచి తీసేసి.. ఆ రెండు జిల్లాల బాధ్యతల్ని ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించటం గమనార్హం. దీంతో విజయసాయికి గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. ఆయనపై ఇప్పటికే బోలెడంత భారం మోపిన నేపథ్యంలో.. బరువు తగ్గించే క్రమంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు అనకాపల్లి టికెట్ మిస్ అయిన మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు తాజాగా పార్టీ బాధ్యతల్ని అప్పగించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పని చేసేలా ప్లాన్ చేశారు. ఆయన్ను ఉప ప్రాంతీయ సమన్వయకర్త (డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్)గా నియమించారు. విజయవాడ సెంట్రల్ టికెట్ రాని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నగర పార్టీ అధ్యక్ష బాద్యతల్ని అప్పగించగా.. కర్నూలు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలకు నంద్యాల జిల్లా బాధ్యతను ఇచ్చారు.
ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని పార్టీ బాధ్యత నుంచి తప్పించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించటం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న కె. సురేశ్ బాబుకు తాజాగా రాజంపేట పార్లమెంటరీ పరిధినీ అప్పజెప్పారు. గెలుపే లక్ష్యంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న అధినేత ఆలోచనలకు తగ్గట్లు తాజా నిర్ణయాలు ఉన్నట్లు చెబుతున్నారు.