టీడీపీ ప్రభంజనంతో వైసీపీ హెడ్ క్వార్టర్ ఖాళీ
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేసింది.
By: Tupaki Desk | 4 Jun 2024 7:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఎగ్జిట్ అంచనాలకు మిన్నగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం టీడీపీ కూటమికి 130 సీట్ల వరకు రావొచ్చని లెక్కలు కట్టారు. కానీ.. అన్ని స్థానాల్ని టీడీపీనే సొంతంగా గెలుచుకోవటం చూస్తే.. ఏపీలో సైకిల్ జోరు ఏ రేంజ్ లో ఉందన్న విషయం అర్థమవుతుంది.
కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన జనసే... పట్టుమని పది స్థానాల్లో గెలిస్తే గొప్పని.. ఆ మాటకు వస్తే ఐదు స్థానాల్లో అయినా గెలుస్తారా? అంటూ ఎటకారానికి బదులుగా 20స్థానాల్లో అధిక్యతలో దూసుకుపోతున్న తీరు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే.. జనసేన అధిక్యతలో ఉన్న సీట్లల్లో కూడా అధికార వైసీపీ లేకపోవటం. ఆ పార్టీ పోటీ చేసిన 175 స్థానాల్లో కేవలం14 స్థానాల్లో మాత్రమే అధిక్యతలో ఉండటం చూస్తే.. ఏపీలో కూటమి ప్రభంజనం ఎంత భారీగా ఉందన్న విషయం అర్థమవుతుంది.
ఈ ఫలితాలు వైసీపీ వర్గాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. నిన్నటి వరకు తాము మరోసారి అధికారంలోకి రావటం ఖాయమని చెప్పిన వైసీపీ వర్గాలు ఎవరూ బయటకు కనిపించని పరిస్థితి. తాజాగా వెలువడుతున్న ఫలితాల నేపథ్యంలో వైసీపీ వర్గాలు పూర్తి నిరాశ.. నిస్ర్పహలో కూరుకుపోతున్నాయి. వైసీపీ హెడ్ క్వార్టర్ మొత్తం బోసిపోయింది. మంగళగిరిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద నిన్నటి వరకు హడావుడిగా ఉన్న నేతలు.. కార్యకర్తలు ఎవరూ కనిపించని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఇంటిబాట పడుతున్నారు. నిజానికి.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల.. కౌంటింగ్ చివరి వరకు సెంటర్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని చెప్పిన మాటల్ని అభ్యర్థులు పట్టించుకోని పరిస్థితి. మరోవైపు టీడీపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జనసేన వర్గాల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎందుకంటే.. తాము పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లటం ఇప్పుడు అందరి చూపు పవన్ మీద పడేలా చేసింది. మొత్తంగా చూస్తే.. ఐదేళ్ల క్రితం దారుణ పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం ఈసారి అందుకు భిన్నంగా.. ఘన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పక తప్పదు.