Begin typing your search above and press return to search.

సినీ నటుడి విగ్రహం వ్యవహారం.. కొడాలి నాని ఇలాకాలో తన్నులాట!

ఇటీవల ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై పరోక్షంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 8:05 AM GMT
సినీ నటుడి విగ్రహం వ్యవహారం.. కొడాలి నాని ఇలాకాలో తన్నులాట!
X

ఇటీవల ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై పరోక్షంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. సినీ ఇండస్ట్రీలో కొంతమంది పకోడీ గాళ్లు తమకు నీతులు చెప్తున్నారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మెగాభిమానుల్లో ఆగ్రహం తెప్పించాయి. అయితే ఆ తర్వాత కొడాలి నాని.. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తాను ఆయనను ఉద్దేశించి అనలేదని.. ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

మళ్లీ ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ విగ్రహం ఏర్పాటు వ్యవహారం వైసీపీలోనే ఉన్న ఇద్దరు కాపు నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైందని టాక్‌. వైసీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, ఆ పార్టీకే చెందిన మరో నేత వడ్లాని సుధాకర్‌ బహిరంగంగా గుడివాడ రోడ్డుపైన గొడవకు దిగారని అంటున్నారు. దీంతో వారి అనుచరులు సైతం రంగ ప్రవేశం చేయడంతో రణరంగంగా మారిందని చెబుతున్నారు.

ఈ వివాదం వ్యవహారంలోకి వెళ్తే.. సినీ నటుడు కైకాల సత్యనారాయణ విగ్రహాన్ని గుడివాడలో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో వడ్లాని సుధాకర్‌.. ఇటీవల కొడాలి నానిని కలిసి విగ్రహ ఏర్పాటు అంశంపై చర్చించారు. వైసీపీలో సీనియర్‌ గా ఉన్న తనను మాట మాత్రం సంప్రదించకుండా, పిలవకుండా వడ్లాని సుధాకర్‌ విగ్రహ ఏర్పాట్లు చేస్తుండటంతో మండలి హనుమంతరావు ఆయనపై గరంగరంగా ఉన్నారని టాక్‌. అంతేకాకుండా తనపై సుధాకర్‌ పార్టీ నేతల వద్ద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో కొత్తగా పింఛన్ల కార్యక్రమంతోపాటు వైఎస్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి సెప్టెంబర్‌ 2న బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడివాడకు వచ్చారు. ఈ క్రమంలో వడ్లాని సుధాకర్, మండలి హనుమంతరావు రోడ్డుపై ఒకరికొకరు ఎదురుపడటంతో సుధాకర్‌ పై మండలి మండిపడ్డట్టు తెలిసింది. దీనికి అంతే ధీటుగా సుధాకర్‌ కూడా స్పందించడంతో ఇద్దరు నేతలు, వారి అనుచరులు బాహాబాహీకి దిగారని తెలుస్తోంది.

ఈ క్రమంలో హనుమంతరావుపై సుధాకర్‌ చేయి చేసుకున్నారని ప్రచారం జరగింది. దీంతో ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల నేతలు తోసుకున్నారు. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న హనుమంతరావు అనుచరులు కారులో వెళ్లిపోతున్న సుధాకర్‌ ను వెంబడించారు. గుడివాడలోని నెహ్రూ చౌక్‌ వద్ద ఆయన కారు అద్దాలను రాళ్లతో పగులకొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు నేతల అనుచరులను పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

కాగా తనను ఎవరూ కొట్టలేదని.. తనపై చేయిచేసుకునేంత ధైర్యం ఎవరికీ లేదని హనుమంతరావు వెల్లడించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని, వైఎస్సార్‌ వర్ధంతిని రసాభాస చేయడానికి కొందరు టీడీపీ కోవర్టులు ప్రయత్నించారే తప్ప ఎలాంటి గొడవ జరగలేదని ఆయన చెప్పడం గమనార్హం.