Begin typing your search above and press return to search.

కుప్పం.. ఇదే సందు!

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2023 8:27 AM GMT
కుప్పం.. ఇదే సందు!
X

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆయనను జైలుకు తరలించి 20 రోజులవుతోంది. ఈ కేసుతోపాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అంగళ్లు కేసు, తదితర కేసులకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేశారు.

మరోవైపు సందట్లో సడేమియా అన్నట్టు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది.

ఇప్పటికే జరిగిన మున్సిపాలిటీ, పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ సవాళ్లు విసురుతోంది. ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో కుప్పం నియోజకవర్గం చుక్కాని లేని నావలా తయారైంది.

ఈ నేపథ్యంలో ఇదే సందు అన్నట్టు వైసీపీ కుప్పంలో చొచ్చుకుపోతోంది. సామ దాన దండోపాయాలు ప్రయోగిస్తోందని చర్చ జరుగుతోంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తోందని అంటున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల ప్రకారం.. చంద్రబాబు నాయుడు ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం లేదంటున్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో బెయిల్‌ వచ్చినా మరో కేసు.. అందులో బెయిల్‌ వచ్చే లోపు మరోకేసు ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని అంటున్నారు. ఇప్పటికే స్కిల్‌ కేసుతోపాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, చిత్తూరు జిల్లా అంగళ్లులో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ చంద్రబాబుపై మరో కేసు పెట్టారు. వీటిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఇలా ఒక కేసులో నుంచి చంద్రబాబు బెయిల్‌ తెచ్చుకుని బయటపడ్డా మరో కేసులో ఆయనను జైలుకు పంపడానికి ఏపీ సీఐడీ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుందని టాక్‌ నడుస్తోంది.

ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా కుప్పం నియోజకవర్గంలో జరగాల్సినవి జరిగిపోతున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుపే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్‌ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని చెబుతున్నారు.

కుప్పంలో ఓవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూనే మరోవైపు టీడీపీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. తమ మాట విననివారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

కుప్పాన్ని ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులతో ఆయా రంగాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు కూడా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు అందిస్తున్నారు. అడిగిందే తడవుగా ఎవరికి ఏం కావాలంటే అవి చేస్తున్నారు. కొత్త 35 వేల మందికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు లేనివారికి వాటిని అందిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గం అంతటా యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయడంతోపాటు ఎక్కడెక్కడ కొరత ఉంటే అక్కడ తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబును పెద్ద అవినీతిపరుడిగా చిత్రీకరించి కుప్పం అంతటా కరపత్రాలు పంచాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జైలుపాలవడంతో కుప్పంలో సులువుగా గెలవొచ్చని వైసీపీ భావిస్తోంది. ఇప్పుడు ఇదే సందని గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.