Begin typing your search above and press return to search.

మండపేటలో మంటలు పుట్టించేందుకు వైసీపీ రెడీ

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి సీటు మండపేట. ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 3:00 AM GMT
మండపేటలో మంటలు పుట్టించేందుకు వైసీపీ రెడీ
X

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి సీటు మండపేట. ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. ఈయన 2009 నుంచి అలా గెలుస్తూనే ఉన్నారు. వైఎస్సార్ వేవ్ ని చిరంజీవి ప్రజారాజ్యం ఊపుని, జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని ముమ్మారు గెలిచారు. చాలా సైలెంట్ గా ఉండే జోగేశ్వరరావు మంత్రి కూడా కాలేకపోయారు కానీ మండపేటలో టీడీపీకి బలమైన పునాదులు వేసేశారు.

ఆయనకు 2014లో అయితే లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. అంటే రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న మండపేటలో సగానికి పైగా ఆయనకే వేశారు అన్న మాట. ఇక 2014, 2019లలో పోటీ చేసిన వైసీపీ రెండు సాల్లొ ఓడింది. 2014లో గిరిజాల వెంకటస్వామినాయుడు వైసీపీ మీద పోటీ చేసి 35 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఇక 2019లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి 10 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడారు.

అయితే ఇక్కడ 2019లో 35 వేల దాకా ఓట్లు వచ్చాయి. అలా తన ఓట్లను జనసేన చీల్చినా పదివేలకు తక్కువ కాకుండా మెజారిటీ తెచ్చుకుని గెలవడం జోగేశ్వరరావు సొంత ఇమేజ్ అని అంటున్నారు. ఆయన అంత బలంగా పాతుకుపోయారు. ఆయన్ని ఓడించడం ఎలా అని వైసీపీ తెగ మధన పడుతూ మొత్తానికి గట్టి అభ్యర్ధినే రెడీ చేసి పెట్టింది.

ఆయనే టీడీపీ నుంచి రామచంద్రాపురం సీటులో ఎన్నో సార్లు గెలిచిన తోట త్రిమూర్తులు. ఆయన 2019 ఎన్నికల తరువాత వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ ఇచ్చింది. దాంతో పాటు మండపేట ఇంచార్జిగా నియమించింది. ఈ పరిణామంతో టీడీపీ కొంత జాగ్రత్తపడాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలా కాదు తోట చాలా గట్టి అభ్యర్ధి. ఆయనకు మండపేటలో సొంతంగా బలముంది. వైసీపీ ఓటు బ్యాంక్ ని కలుపుకుంటే జోగేశ్వరరావుని సెకండ్ హ్యాట్రిక్ కి చోటు లేకుండా ఓడించగలరని అంటున్నారు.

అయితే టీడీపీతో పాటు జనసేనకు కూడా ఇక్కడ బలం ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే మళ్లీ లక్ష ఓట్లను పట్టుకుని పోతాయి. అపుడు సంగతేంటి అన్న చర్చ వస్తోంది. అయితే తోట త్రిమూర్తులు రాజకీయ చతురుడు కావడమే కాకుండా కాపు సామాజికవర్గం నేత కూడా కావడంతో ఆయన ఆ సామాజికవర్గం ఓట్లను తన వైపు తిప్పుకుంటున్నారు అని అంటున్నారు. ఇక పొత్తులు ఉన్నా జనసేన ఓట్లు ఆ వైపునకు షిఫ్ట్ కాకుండా తోట రాజకీయ మంత్రాంగం ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే టీడీపీకి కంచుకోట అయిన మండపేటలో మంటలు పుట్టించేందుకు వైసీపీ సర్వం సిద్ధం చేసి పెట్టుకుంది. తోట త్రిమూర్తులు రూపంలో బలమైన క్యాండిడేట్ కూడా దొరికారు. దాంతో ఈ సీటు తమదేనని నమ్ముతోంది. చూడాలి మరి మండపేటలో ఈసారి పోటీ ఎలా ఉంటుందో పొత్తులు కుదిరితే ఎలా ఈక్వేషన్స్ ఉంటాయి, లేకపోతే మరెలా ఉంటాయి అన్నది కూడా చూడాలని అంటున్నారు.