ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్ లడాయి!
ఎన్నికల్లో గెలవాలి.. అధికారంలోకి రావాలంటే పాదయాత్ర తప్పనిసరి అని భావించే నేతలు ఎక్కువైపోతున్నారు.
By: Tupaki Desk | 1 Sep 2023 5:26 AM GMTఎన్నికల్లో గెలవాలి.. అధికారంలోకి రావాలంటే పాదయాత్ర తప్పనిసరి అని భావించే నేతలు ఎక్కువైపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాక్షిక పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర ద్వారానే ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. అలాగే గతంలో ఏపీలోనూ, ఇటీవల తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు.
ఇప్పుడు వీరి బాటలోనే ఎమ్మెల్యే టికెట్ కోసం ఓ వైసీపీ కార్పొరేటర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గానికి చెందిన 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాధిక్ ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ గా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలోనూ సభ్యత్వం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున విశాఖ సౌత్ నియోజకవర్గం సీటును ఆశిస్తున్నారు.
కాగా 2019 ఎన్నికల్లో విశాఖ సౌత్ సీటును టీడీపీ గెలుచుకుంది. టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్ కుమార్.. వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ పై విజయం సాధించారు. 2014లోనూ వాసుపల్లి గణేశే విజయం సాధించారు. అయితే ఆయన 2019లో గెలిచాక వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకే అని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు విశాఖ సౌత్ లో ముస్లింలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటంతో వైసీపీ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్ టికెట్ తనకే అని ఆశాభావంతో ఉన్నారు. ఇందుకు పాదయాత్రే సరైన మార్గమని నమ్మి విశాఖ సౌత్ నియోజకవర్గమంతా ఆయన చురుగ్గా పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. వారికేమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
వాస్తవానికి మహ్మద్ సాధిక్ మొదటి నుంచి వైసీపీలో లేరు. 2021లో ఇండిపెండెంట్ గా నిలబడి కార్పొరేటర్ గా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. పార్టీ కూడా ఆయనను చేరదీసింది. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పార్టీ ప్రయోజనాల రీత్యా మంచి ప్రాధాన్యతనే ఇస్తోంది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో సీటు కోసం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరి సాధిక్ కు సీటు లభించేనా? ఆయనకు సీటు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఊరుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.