వైసీపీ ఫైనల్ లిస్ట్ కి కౌంట్ డౌన్...!
వైసీపీ తుది జాబితాకు తుది రూపు దిద్దుకుంటోంది అని ప్రచారం సాగుతోంది
By: Tupaki Desk | 9 Jan 2024 3:00 AM GMTవైసీపీ తుది జాబితాకు తుది రూపు దిద్దుకుంటోంది అని ప్రచారం సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తం ముప్పయి ఎనిమిది మంది అభ్యర్ధులతో వైసీపీ రెండు జాబితలను విడుదల చేసింది. తొలి జాబితాలో పదకొండు మందిని ఎంపిక చేస్తూ కీలక మార్పులతో టెన్షన్ పుట్టించింది.
ఆ తరువాత ఇటీవల రెండవ జాబితాను 27 మందితో రిలీజ్ చేసింది. ఇపుడు ఏకంగా 29 మందితో మూడవ జాబితా సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాను రేపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీంతో కలిపి మొత్తం వైసీపీ సిట్టింగు అభ్యర్ధుల విషయంలో చేస్దిన మార్పుచేర్పులు 67 స్థానాలకు చేరుకుంటాయని అంటున్నారు.
అంటే వైసీపీ 2019 ఎన్నికల్లో 151 మందితో గెలిచింది. ఆ తరువాత మరో ముగ్గురు ఆ పార్టీకి టీడీపీ నుంచి మద్దతు ఇస్తే జనసేన నుంచి రాపాక ప్రసాదరావు మద్దతు ఇచ్చారు. దీంతో మొత్తం 155 మంది వైసీపీ వైపు ఉన్నట్లుగా లెక్క.
ఇందులో నుంచి 67 సిట్టింగ్ సీట్లలో అభ్యర్ధుల మార్పు అంటే దాదాపుగా సగానికి సగం చేసినట్లే అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది అతి పెద్ద మార్పు అని కూడా అంటున్నారు. జాతీయ పార్టీలు సైతం మార్పు చేర్పులు ఎన్నికల వేళ చేశాయి కానీ ఇంత పెద్ద సంఖ్యలో చేయలేదు అని భారత రాజకీయ చరిత్ర చెబుతోంది.
బీజేపీ గుజరాత్ కర్నాటకలో మార్పులు చేసింది. అక్కడ కూడా స్కోర్ నలభై లోపుగానే ఉంది. ఎక్కువగా గుజరాత్ లోనే మార్పులు చేసింది. ఇక మిగిలిన చోట్ల మార్పులు చేసినా అంత నంబర్ అయితే లేదు. మరో వైపు ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా పెద్దగా మార్పుచేర్పులకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. చేసిన సింగిల్ డిజిట్ తొనే సరిపెడతాయి అని అంటున్నారు.
కానీ వైసీపీ మాత్రం ఏకంగా 70 దాకా సిట్టింగ్ సీట్లలో మార్పుచేర్పులు చేయడం అంటే ఆ పార్టీ అధినేత గట్స్ గురించే చర్చ సాగుతోంది. ఈ మార్పు చేర్పుల వల్ల కలిగే రాజకీయ లాభాల సంగతి పక్కన పెడితే ఎలాంటి మొహమాటాలు కాకుండా రాజీ లేని ధోరణితో ఉంటేనే ఇలా చేయగలరు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఇప్పటిదాకా భారతీయ రాజకీయ చరిత్రలో లేని విధంగా కొత్త ప్రయోగమే చేసింది అని అంటున్నారు.
ఇక చూస్తే తుది జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయా అన్న టెన్షన్ ఉంది. ఈసారి ఎక్కువగా ఉత్తరాంధ్రా క్రిష్ణా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కర్నూల్ వంటి చోట్ల మార్పులు ఉంటాయని అంటున్నారు. మార్పు గురించి సిట్టింగులకు చెప్పడం నచ్చ చెప్పడం, భవిష్యత్తు మీద భరోసా ఇవ్వడం వంటివి వైసీపీ చేస్తోంది.
ఆ మీదట వారి ఇష్టం అన్నట్లుగా వదిలిపెడుతోంది. తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే సామాజిక న్యాయం తో పాటు గెలుపు గుర్రాలకు చాన్స్ ఇస్తూ ముందుకు సాగడం వల్ల అత్యధిక స్థానాల విషయంలో అసంతృప్తి అయితే రావడంలేదు అని అంటున్నారు. ఫైనల్ లిస్ట్ బయటకు వస్తే ఇక మిగిలిన చోట్ల నుంచి ప్రస్తుతం ఉన్న వారే పోటీ చేస్తారని అనుకోవాల్సి ఉంటుంది.