పాపం జగన్: చేసిన మంచీ చెడగొట్టుకున్నారే!
ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా.. తమ భూములను అసైన్డ్ పరిధి నుంచి తప్పించి.. తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది.
By: Tupaki Desk | 30 July 2024 2:30 PM GMTఆశ్చర్యం లేదు.. అతిశయమూ లేదు... కాడిమోయాల్సిన అవసరమూ లేదు.. గత వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయా? సక్రమాలు ఏమీ జరగలేదా? అంటే.. కొన్నికొన్ని మంచి నిర్ణయాలూ తీసుకున్నారు. దీనికి ఉదాహరణే అసైన్డ్ భూములు. ప్రస్తుతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సెగపెడుతున్న వ్యవహారమే ఇది! వాస్తవానికి జగన్ హయాంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయాన్ని అడ్డు పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో నాయకులు ఆడిన నాటకం.. ఆస్తులు పోగేసుకున్న వైనం కారణంగా.. ఆ చేసిన మంచినీ చెడగొట్టుకున్నట్టయింది!!
ఏంటీ నిర్ణయం..
30 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వాలు భూమిలేని నిరుపేదలకు.. చెరువులు, కుంటలు, పోరంబోకు.. ఇలా అనేక స్థలాలను గుర్తించి.. వాటిని అసైన్ చేస్తూ.. పేదలకు పంచి పెట్టింది. వీటినే `అసైన్డ్` భూములుగా పేర్కొంటారు. అంటే.. వీటిని పొందిన వారికి ఎలాంటి హక్కులూ ఉండవు. వాటిని అమ్ముకునేందుకు.. తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ఆయా కుటుంబాలకు భూరక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం.
ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా.. తమ భూములను అసైన్డ్ పరిధి నుంచి తప్పించి.. తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. దీనిపై 2014లో చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పారు. కానీ, కారణాలు ఏవైనా.. ఆయన అలా చేయలేక పోయారు. కానీ, 2019లో అధికారం చేపట్టిన జగన్.. వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో 20 ఏళ్లకు పైబడి.. అసైన్డ్ భూముల్లో ఉంటున్నవారికి సర్వ హక్కులు దక్కేలా చేస్తూ.. జీవో ఇచ్చారు. వీటిని ఆయా ఇళ్ల లబ్దిదారులు అమ్ముకున్నా.. తాకట్టు పెట్టుకున్నా.. స్వేచ్ఛ కల్పించారు. ఇది మంచి నిర్ణయమేనని టీడీపీ నాయకులు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా తప్పులేదనే అంటున్నారు.
ఏం జరిగింది?
జగన్ చేసిన ఈ పనిని కొందరు వైసీపీ ప్రబుద్ధులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇలాంటి పనినే పెద్దిరెడ్డి కూడా చేశారు. అసైన్డ్‌గా ఉన్న చెరువు భూమిని దాదాపు 5 ఎకరాల మేరకు.. తన సతీమణి స్వర్ణ లత పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే తప్పేంటి? అనేది ప్రశ్న. ఈమె రిజిస్ట్రేషన్ చేయించుకున్న చెరువు భూమి.. జగన్ సర్కారు ఇచ్చిన జీవో ప్రకారం 20 ఏళ్లు పూర్తి కాలేదు. 20 ఏళ్లు పూర్తయితేనే వాటిపై హక్కులు వస్తాయి.
కానీ,అలా కాకుండా.. ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు అసైన్డ్ భూములు రాయించుకున్నారు. కొందరు బలవంతంగా తీసుకున్నారు. ఇదే ఇప్పుడు చేటైంది. ఏదేమైనా.. తప్పులు జరుగుతున్నాయని అప్పట్లో తెలుసు. అయినప్పటికీ.. జగన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఫలితం ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. మంచి నిర్ణయం తీసుకోవడమే కాదు.. మంచిని కొనసాగించడం అత్యంత కీలకం.