Begin typing your search above and press return to search.

కర్నూలు ఈనాడు ఆఫీసు మీద దాడి.. అసలేం జరిగింది?

మంగళవారం సాయంత్రం 5.30 గంటల వేళలో పెద్ద ఎత్తున వచ్చిన గుంపు ఈనాడు ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:44 AM GMT
కర్నూలు ఈనాడు ఆఫీసు మీద దాడి.. అసలేం జరిగింది?
X

కర్నూలు పట్టణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈనాడు సిటీ ఆఫీసు మీద వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాదాపు 40 మంది పోలీసులకు పైనే ఉన్నప్పటికీ 250 మందికి పైగా వచ్చిన కాటసాని వర్గీయుల్నినిలువరించటం సాధ్యం కాలేదు. కర్నూలు పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఈనాడు ఆఫీసు ఉంది. రాజ్ థియేటర్ ఎదురుగా ఉండే ఈ కార్యాలయం మొదటి అంతస్తులో ఉంటుంది.

మంగళవారం సాయంత్రం 5.30 గంటల వేళలో పెద్ద ఎత్తున వచ్చిన గుంపు ఈనాడు ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టింది. ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న రాళ్లతో ఆఫీసుపై విసిరారు. కొందరు.. ఈనాడు ఆఫీసు పైకి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులకు వారిని అదుపు చేయటం సాధ్యం కాలేదు. దాదాపు గంట పాటు సాగిన వీరంగం దెబ్బకు.. అక్కడే ఉన్న షాపుల వారు తమ దుకాణాల్ని మూసేశారు.

సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఈనాడు దినపత్రికలో ఒక కథనం వెలువడింది. దీనికి నిరసనగా కాటసాని వర్గీయులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గురించి తెలిసినంతనే ఈనాడు ఆఫీసులోని ఉద్యోగుల్ని బయటకు పంపేసి.. ఆఫీసుకు తాళం వేయటంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. ఆఫీసు బయట ఉన్న బోర్డును.. కిటీకి అద్దాల్ని ధ్వంసం చేశారు. బయట ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. 40 మంది పోలీసుల్ని ఆందోళకారులు లెక్క చేయలేదు. కాకుంటే.. శ్రుతిమించి రాగాన పడిన చందంగా ఆఫీసు తాళం బద్ధలు కొట్టే వేళలో మాత్రం.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా జై కాటసాని.. కాటసాని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓపక్క విధ్వంసానికి దిగిన కాటసాని వర్గీయులు మరోవైపు తమకు న్యాయం చేయాలని.. రామోజీని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేయటం గమనార్హం. మొత్తమ్మీదా ఈ ఘటన సంచలనంగా మారింది. దాదాపు గంటల అనంతరం ఆందోళనాకారుల్ని అక్కడి నుంచి పంపించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో సహా పలువురు ఈ దాడిని పెద్ద ఎత్తున ఖండించారు.

ఈ దాడికి పాల్పడిన పలువురిని గుర్తించారు. అందులో కర్నూలు నగర కార్పొరేటర్లు శ్వేతారెడ్డి.. ఐజా అరుణ.. అక్ష్మీరెడ్డి.. దండు లక్ష్మీకాంత రెడ్డి.. సానా శ్రీనివాసులు.. నారాయణ రెడ్డి.. సుదర్శన్ రెడ్డి.. మైటాపు నర్సింహులతో పాటు.. వైసీపీకి చెందిన అక్కిమి హనుంతరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, మిడుతూరు శ్రీనివాసులు, కల్లూరు రంగప్ప తదితరులు ఉన్నారు.