Begin typing your search above and press return to search.

’ఊ‘ అంటావా బాబూ ‘ఊహూ’ అంటావా ?!

ఏపీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By:  Tupaki   |   13 July 2024 7:57 AM GMT
’ఊ‘ అంటావా బాబూ ‘ఊహూ’ అంటావా ?!
X

ఏపీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు పరిమితమైపోయిన వైసీపీ శిబిరంలో ప్రస్తుతం నిశ్శబ్దం తాండవిస్తున్నది. గత ఐదేళ్లలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వం తీసుకునే చర్యల నుండి ఎలా తప్పించుకోవాలా ? అన్న ఆలోచనలో పడ్డారు.

అయితే ఇదే సమయంలో వైసీపీ పాలనలో పదవులు లభించినా ప్రాధాన్యత లభించక, నిర్లక్ష్యం, వివక్షకు గురయిన కొందరు ఎమ్మెల్సీలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉత్సాహం చూయిస్తున్నట్లు వస్తున్న వార్తలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

కడపకు చెందిన శాసనమండలి సభ్యురాలు, మండలి వైస్‌ చైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండడం వైసీపీలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. తనకు వైసీపీలో విలువలేదని, పార్టీలో గత ఐదేళ్లలో తమను పట్టించుకోలేదని, తాను టీడీపీలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని ఏకంగా మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను కలిసి చెప్పడం చర్చకు తెరలేపింది. ఆమెతో పాటు గతంలో టీడీపీలో ఉండి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తిరిగి సొంతగూటికి చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

జకియాతో పాటు దాదాపు 5 నుండి ఆరుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఏపీ శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్ కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మరో నలుగురు వైసీపీని వీడడంతో అనర్హత వేటు వేశారు. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ వారిని ఇబ్బందులు పెట్టిన వారిని పార్టీలోకి చేర్చుకోవద్దని, మిగిలిన వారి గురించి ఆలోచిద్దామని చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఒక్కసారి చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే వైసీపీ నుండి చేరికలకు వరస కడతారని అంటున్నారు.