జగన్ మేనమామ కామెంట్స్ వైరల్
151 స్థానాల్లో అసాధారణ విజయం సాధించిన పార్టీ.. ఒక్కసారిగా 11 స్థానాలకు పరిమితం అయితే జీర్ణించుకోవడం చాలా కష్టం.
By: Tupaki Desk | 6 Jun 2024 4:38 AM GMT151 స్థానాల్లో అసాధారణ విజయం సాధించిన పార్టీ.. ఒక్కసారిగా 11 స్థానాలకు పరిమితం అయితే జీర్ణించుకోవడం చాలా కష్టం. అందుకే వైఎస్సార్ కాంగ్రె పార్టీకి ఎన్నికల ఫలితాలు ఎంతకీ మింగుడుపడడం లేదు. ఓడినా ఓకే కానీ.. ఇంతగా చిత్తు కావడం ఏంటన్నదే వారికి అంతుబట్టడం లేదు. పక్కాగా గెలుస్తాం అనుకున్న స్థానాల్లో.. పెద్దగా పేరు లేని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు గెలవడం ఏంటో అని ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల, కౌంటింగ్ ప్రక్రియల మీద వైసీపీ వాళ్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. 2019లో వైసీపీ ఘనవిజయం సాధించినపుడు టీడీపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. ఇప్పుడు వైసీపీ వంతు. వైఎస్ జగన్ మేనమామ, కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి పాలైన రవీంద్రనాథ్ రెడ్డి ఈవీఎంల టాంపరింగ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘‘ఎన్నికలు అయిపోతానే ఒక 15 రోజులు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు అందరూ అదృశ్యం అయిపోయారు. మరి యాడ సింగపూర్లో కూర్చుని ఈ కార్యక్రమాలు టాంపరింగ్ జరిగిందా? ఇంకొక చోట టాంపరింగ్ జరిగిందా అని తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్‌గా ఎక్కడా జరగలా. స్ట్రాంగ్ రూంల మీద పడి మార్చే పరిస్థితి జరగలేదు కానీ.. ఇది టెక్నికల్ అనమాట. బార్ కోడ్ తెలుసుంటే చాలనమాట. స్కాన్ చేసేసి ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుందనమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్లు ఎలా సంపాదించినారు.. ఎలా జరిగింది ఈ టాంపరింగ్ అనేది త్వరలోనే తెలుస్తుందని నేనైతే భావిస్తున్నా’’ అని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఐతే టాంపరింగ్ గురించి ఆరోపణలైతే చేయొచ్చు కానీ.. బార్ కోడ్ తెలుసుకుని స్కాన్ చేసి సింగపూర్లో కూర్చుని సింపుల్‌గా నంబర్లు మార్చేశారంటూ చేసిన వ్యాఖ్యలు మరీ సిల్లీగా ఉన్నాయని నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.