ఇదే మంచి తరుణం.. జనసేనలోకి ఆ నేతలు!
మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 30 July 2024 7:59 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది. ఏకంగా పది లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదుకు గడువు మరింత పొడిగించారు. దీంతో మరింత మంది క్రియాశీలక సభ్యులుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ను తిట్టడం ద్వారా తాము నష్టపోయామని వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు.
రాజకీయాల్లో చిరంజీవిలాగే పవన్ చేస్తాడని సందేహాలు వ్యక్తం చేసిన కాపు కమ్యూనిటీ 2019లో వైసీపీ వెంట నడిచింది. అయితే పవన్ స్వయంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నడిపించారు. ఎక్కడా వెనుకంజ వేయలేదు. దీంతో ఆ కమ్యూనిటీ మొత్తం ఇటీవల ఎన్నికల్లో పవన్ వెంట నడిచింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశముందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరడానికి చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాశ్, తదితరులు ఈ కోవలో ఉన్నారని చెబుతున్నారు.
2019లో దొరబాబు వైసీపీ తరఫున పిఠాపురంలో గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు సీటు ఇవ్వలేదు. నాడు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో పవన్ పై పోటీకి దింపారు. అటు వంగా గీత, ఇటు పెండెం దొరబాబు కూడా పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
పెండెం దొరబాబు, వంగా గీతలకు తోడు ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో విజయానికి గట్టి ప్రయత్నం చేశారు, సాక్షాత్తూ నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు పిఠాపురంలోనే సభ నిర్వహించారు. ఇంత చేసినా పవన్ కళ్యాణ్ ఘనవిజయాన్ని ఆపలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉండటం.. ఈ శాఖల ద్వారా గ్రామాల్లో జనసేన పార్టీని క్షేత్ర స్థాయి వరకు బలంగా విస్తరించాలని నిర్ణయించుకోవడం వంటి కారణాలతో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ జనసేన పార్టీకి గట్టి నాయకులు లేరు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందనే యోచనలో గోదావరి జిల్లాల వైసీపీ నేతలు ఉన్నారని సమాచారం. దీంతో జనసేనలో చేరికకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.