Begin typing your search above and press return to search.

ఇక వైసీపీ నుంచి వలసలు మొదలయినట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 July 2024 1:30 PM GMT
ఇక వైసీపీ నుంచి వలసలు మొదలయినట్టేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. వైనాట్‌ 175 అని చివరకు 11 స్థానాలకే కుదేలయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి.

తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఎన్నికల్లో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారు రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఈయనకు ముందు ఎన్నికల ఫలితాలు వెలువడటం ఆలస్యం.. మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు వైసీపీ నుంచి తప్పుకున్నారు. రావెల టీడీపీలోకి, కిలారు జనసేన పార్టీలోకి వెళ్లనున్నారని టాక్‌ నడుస్తోంది.

వీరే కాకుండా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విచారణ సాగించే అవకాశం ఉండటంతో కేసుల భయం ఉన్న నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

అలాగే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఒంటెద్దు పోకడలు, సలహాదారులపైన, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి ఇద్దరు, ముగ్గురుపైనే ఆధారపడటం నచ్చనివారు తమ, తమ వారసుల రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారుతున్నారని సమాచారం.

వైసీపీలో కేసులు ఉన్న నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆచితూచి వ్యవహరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా టీడీపీ, జనసేనలతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కూటమిలోని మూడు పార్టీలు.. తమ పార్టీల్లో చేరాలనుకుంటున్న వైసీపీ నేతల విషయంలో కలిసికట్టుగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి.

వివాదాస్పద నేతలు, బూతులు తిట్టేవారు, అవినీతి, అక్రమాల కేసులున్నవారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అడ్డంకిగా ఉందని అంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ కాపు నేత ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో నాలుగుసార్లు వివిధ పార్టీల తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై దళితులకు శిరోముండనం చేయించారనే కేసు ఉంది. ఈ కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. అయితే అది ఇంకా అమల్లోకి రాలేదు.

ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి బయటపడటానికి తోట త్రిమూర్తులు బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ను సంప్రదించారని చెబుతున్నారు. ఆయన కూటమి పార్టీలతో మాట్లాడి చెబుతామని త్రిమూర్తులకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక తూర్పుగోదావరి జిల్లాలోనే సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జగన్‌ కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న ఆయనను తప్పించి రాజ్యసభ సీటు ఇచ్చారు.

పార్టీ అవిర్బావం నుంచి ఉన్న తమ కంటే కూడా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వైఎస్‌ జగన్‌ మద్దతు ఇస్తుండటాన్ని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

ఇటీవల తన కుమారుడు సూర్యప్రకాశ్‌ కు సీటు ఇప్పించుకోవడానికి కూడా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు సీటు దక్కించుకున్నారు. రామచంద్రాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన పిల్లి కుమారుడు సూర్యప్రకాశ్‌ ఓటమి పాలయ్యారు.

మరోవైపు పిల్లికి కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోనూ తీవ్ర విభేదాలు ఉన్నాయి. స్వతహాగా సుభాష్‌ చంద్రబోస్‌ సౌమ్యుడు, వివాద రహితుడు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కోసం జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎలాంటి మచ్చా లేని పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆయన కుమారుడిని చేర్చుకోవడానికి పవన్‌ అంగీకరించవచ్చనే చర్చ జరుగుతోంది. వీరే కాకుండా పలువురు వైసీపీ నేతలు ఏదో ఒక కూటమి పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.