ఎందుకు ఓడాం... వైసీపీలో అంతర్మధనం
ఇదిలా ఉంటే జూన్ 4న ఓడిన తరువాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి జగన్ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు
By: Tupaki Desk | 6 Jun 2024 1:10 PM GMTవైసీపీ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ ఓడనంతగా ఘోరాతి ఘోరంగా ఓడింది. జగన్ అధికారంలోకి రావడం ఒక హిస్టరీ అయితే ఆయన ఓటమి కూడా అలాంటి హిస్టరీనే క్రియేట్ చేసింది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ కి జనాలు గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికల్లా మధ్యలో అయిదు తీసేసి 11 మాత్రమే ఇచ్చారు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒక్క లెక్కన సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే జూన్ 4న ఓడిన తరువాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి జగన్ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఆ తరువాత మధ్యలో ఒక్క రోజు గడిచింది. వైసీపీ నుంచి పెద్దగా ఏమీ అప్డేట్స్ లేవు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు గ్రామాలలో వైసీపీని టార్గెట్ చేశారు.
పార్టీ కోసం పనిచేసిన వారు అంతా ఇపుడు టార్గెట్ అయిపోయారు. వారి మీద దాడులు జరుగుతున్నాయి. దాంతో జగన్ నాయకత్వంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఓడిన తరువాత జగన్ నాయకత్వంలో తొలిసారిగా వైసీపీ సమావేశం అయింది.
ఈ సమావేశం కంటే ముందే జగన్ మా వాళ్ళను టీడీపీ కూటమి నేతలు వేధిస్తున్నారు. దాడులు చేస్తున్నారు, రక్షించండి అంటూ గవర్నర్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాము వైసీపీ క్యాడర్ కి అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఆ తరువాత పార్టీ ఘోర ఓటమి మీద జరిగిన సమీక్షలో వైసీపీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.
వైసీపీ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలు కూడా హాజరయ్యారు. అలాగే, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ వంటి వారు కూడా ఈ సమావేశానికి హాజరై ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించారు.
ఇదిలా ఉంటే పార్టీకి ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమి కలగడానికి కారణాలు కూడా ఈ సమావేశంలో చర్చించారు. వైసీపీకి ఎన్నడూ లేని విధంగా ఓట్లు తగ్గడం మీద కూడా చర్చ సాగింది. వైసీపీకి నూటికి తొంబై శాతం ఓట్లు ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఈసారి టీడీపీ కూటమి వైపు టర్న్ కావడం పట్ల కూడా సమీక్ష చేశారు.
అంతే కాదు వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో ఎందుకు పార్టీ ఓటమి పాలు అయింది అన్నది కూడా చర్చించారు అని భోగట్టా. ఏది ఏమైనా షాక్ లో ఉన్న వైసీపీకి ఈ ఫలితాల సమీక్షలో కూడా ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయో ఒక పట్టాన బాధపడడం లేదు అని అంటున్నారు.