Begin typing your search above and press return to search.

చిన్న శ్రీను...బెల్లానల మధ్య ఎంపీ సీటు ఫైట్...!?

అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కూడా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు చుట్టమే అన్నది తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:59 AM GMT
చిన్న శ్రీను...బెల్లానల మధ్య ఎంపీ సీటు ఫైట్...!?
X

బొత్స మేనల్లుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇపుడు విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. ఆయనకు జగన్ జోడు పదవులు ఇచ్చారు. విజయనగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గా చిన్న శ్రీను ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది.

అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కూడా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు చుట్టమే అన్నది తెలిసిందే. పైగా ఆయనది చీపురుపల్లి నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. దాంతో ఆయనకు ఎక్కడ అడ్జస్ట్ చేయాలన్నది ఇపుడు వైసీపీకి పెద్ద ప్రశ్నగా మారింది అని అంటున్నారు.

చిన్న శ్రీనుకు ఎంపీ సీటు ఇవ్వడం ఖాయం. అయితే బెల్లానకు కూడా చోటు చూపించాల్సి ఉంది. లేకపోతే ఆయన ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారో అన్న కంగారు ఉందని అంటున్నారు. ఆయనకు ఉన్న బలంతో ప్రత్యర్ధి పార్టీలో చేరితే జిల్లాలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి బిగ్ ట్రబుల్ ఈసారి సంభవించవచ్చు అని అంటున్నారు.

దాంతో బెల్లాన విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నారుట. ఇక చీపురుపల్లిలో ఆయనకు బలం ఉంది. అక్కడ నుంచి మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయబోతున్నారు. బెల్లానకు సీటు చూపించే బాధ్యత సీనియర్ మంత్రి మీద కూడా పడింది అని అంటున్నారు. లేకపోతే ఆయన వర్గం రివర్స్ అయితే మంత్రి గెలుపునకు కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గానికి బెల్లానను పంపించి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అన్న ప్రచారం సాగుతోంది. ఎచ్చెర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మీద తీవ్ర వ్యతిరేకత ఇటు జనంలోనే కాదు అటు పార్టీలోనూ ఉంది అని అంటున్నారు. దాంతో బెల్లానను అక్కడ పోటీ చేయిస్తే ఒకే సామాజిక వర్గం కాబట్టి ఇబ్బంది ఉండదు, పైగా ఆ సామాజిక వర్గం ఓట్లు అత్యధికం అక్కడ ఉన్నాయి కాబట్టి మరోసారి వైసీపీ గెలుపు ఈజీ అవుతుందని ఆలోచిస్తున్నారుట.

ఇక ఇక్కడ మరో చిక్కు ముడి ఏంటి అంటే గొర్లె సైతం తనకు ఈసారి చాన్స్ కావాలని కోరుతున్నారు. ఆయనను ఒప్పించాల్సి ఉంది. ఆయన కాదంటే తన వర్గంతో ఏమైనా ఇబ్బంది క్రియేట్ చేస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. మొత్తానికి ఈ తలనొప్పులు అన్నీ ఇపుడు సీనియర్ మంత్రి బొత్స మీద పడ్డాయట. ఆయన వీటిని క్లియర్ చేసి ఎవరు ఎక్కడ నుంచి పోటీ అన్నది డిసైడ్ చేస్తే నాలుగవ జాబితాలో విజయనగరం ఎంపీతో పాటు ఎచ్చెర్ల సీటు విషయం కూడా తేలుతుంది అన్నది అంటున్నారు.