Begin typing your search above and press return to search.

కిరీటాలు వద్దు అంటున్న వైసీపీ లీడర్స్ ?

వైసీపీ అధికారం దిగిపోయిన పార్టీ. ఇక మీదట విలాసాలు కులాసాలు ఉండవ్. ఒళ్ళు విరగదీసుకుని పనిచేయడమే ఉంటుంది.

By:  Tupaki Desk   |   7 July 2024 5:51 PM GMT
కిరీటాలు వద్దు అంటున్న వైసీపీ లీడర్స్ ?
X

వైసీపీ అధికారం దిగిపోయిన పార్టీ. ఇక మీదట విలాసాలు కులాసాలు ఉండవ్. ఒళ్ళు విరగదీసుకుని పనిచేయడమే ఉంటుంది. ఎక్కడ చూసినా కష్టాలు కడగండ్లే కనిపిస్తాయి. ఒకటి రెండు కాదు అయిదేళ్ల పాటు అధికార పక్షంతో పోరాటం చేయాల్సి ఉంది.

అదే టైంలో గతంలో వైసీపీ అనుసరించిన కక్ష సాధింపు విధానాలకు రెట్టింపు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లు కూడా భరించాల్సి ఉంటుంది. అలాగే కేసులు అరెస్టులు ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇక పార్టీ ప్రతీ జిల్లాలో కట్టిన పార్టీ ఆఫీసుల కూల్చివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడుగా కదులుతోంది. వేతికీ అనుమతులు లేవని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే కోర్టు పరంగా స్టే ఉంది. కొంతకాలం పాటు వెసులుబాటు ఉంది. అనుమతులు ఈ లోగా తెచ్చుకోవాలి.

ఏ ఒక్క ఆఫీసు మీద చేయి పడకుండా కాపాడుకోవాలి. ఇక పార్టీని నిత్యం నడిపించాలి క్యాడర్ ని దగ్గరకు తీయాలి. వీధి పోరాటాలకు సిద్ధం కావాలి. ఇవన్నే అతి పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మొత్తంగా చెప్పుకుంటే వైసీపీలో జిల్లా అధ్యక్ష కిరీటాలు పెడతామని అంటూంటే మాకెందుకు అన్నట్లుగా చాలా మంది తప్పుకుంటున్నారు అని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రులుగా పనిచేసిన వారికి బాధ్యతలు అప్పగిస్తే వారు ఇన్నాళ్ళూ అధికార వైభోగం చూసారు కనుక తట్టుకోగలరు అని హై కమాండ్ భావిస్తోంది.

వారితో సంప్రదిస్తోంది అని అంటున్నారు. జిల్లాలలో పార్టీ కార్యవర్గాలను మార్చి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అయితే చాలా మంది మాజీ మంత్రులు మాత్రం అంత సుముఖంగా లేరు అని అంటున్నారు. మేము సలహాలు ఇస్తామని పక్కన ఉంటామని అంటున్నారని ప్రచారం సాగుతోంది. ఎవరికైనా అధ్యక్ష బాధ్యతలు అప్పగించండని తప్పుకుంటున్నారుట.

దీంతో ఈ వ్యవహారం వైసీపీ హై కమాండ్ కి మింగుడు పడడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే పార్టీలో సీనియర్ నేతలు అంగ బలం అర్ధ బలం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే సంస్థాగతంగా పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. అయితే చాలా పెద్ద తలకాయలు మాత్రం గమ్మున ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇది తెలుగుదేశం హయాంలోనూ జరిగింది. తెలుగుదేశం 2019లో ఓడినపుడు కూడా చాలా మంది కీలక నేతలు ముఖాలు చాటేశారు.తొలి మూడేళ్ళు చంద్రబాబు లోకేష్ మాత్రమే ఫీల్డ్ లో కనిపించారు. అపుడు బాబు కొత్త వారికి చాన్స్ ఇచ్చి అధ్యక్ష బాధ్యతలతో వారికే పనిచెప్పారు. అలా పార్టీని నడిపించుకుని వచ్చారు.

ఈ నేపధ్యంలో వైసీపీ కూడా ఇదే సరైన సమయం కాబట్టి కొత్త వారికి బాధ్యతలు ఇచ్చి వారితోనే నడిపిస్తే బాగుంటుంది అన్న సూచనలు కూడా అందుతున్నాయని అంటున్నారు. అయితే కొత్త వారికి ఇస్తే ఆర్థిక పరమైన భారాన్ని పార్టీయే మోయాల్సి ఉంటుంది. అలాగే వారికి ఎప్పటికపుడు గైడెన్స్ ఇచ్చి నడిపించాల్సి ఉంటుంది. ఇక నిరంతరం హై కమాండ్ పార్టీతోనే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇలా ఒక్క రోజు కాదు అయిదేళ్ల పాటు ఒక యాగంగా చేసుకుని పోతేనే పార్టీ జనంలో కనిపిస్తుందని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ హై కమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో.