Begin typing your search above and press return to search.

పోరాటానికి వైసీపీ నేతలు సిద్ధంగా లేరా ?

వైసీపీలో నిర్లిప్తత అలా కొనసాగుతోంది. ఆ పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. నలభై మందిదాకా మంత్రులుగా పనిచేశారు

By:  Tupaki Desk   |   1 Aug 2024 3:42 AM GMT
పోరాటానికి వైసీపీ నేతలు సిద్ధంగా లేరా ?
X

వైసీపీలో నిర్లిప్తత అలా కొనసాగుతోంది. ఆ పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. నలభై మందిదాకా మంత్రులుగా పనిచేశారు. ఇక అనేక మంది వివిధ హోదాలలో పార్టీలో ప్రభుత్వంలో కొనసాగారు. వైసీపీ విపక్షంలోకి వచ్చిన తరువాత వారంతా ఫుల్ సైలెంట్ అయ్యారు.

ఎందుకు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ వెరసి వారికి వైసీపీ అధినాయకత్వం మీదనే కోపం ఎక్కువగా ఉందని అంటున్నారు. తాజాగా ఒక వీడియో బైట్ ని విడుదల చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే టీడీపీ కూటమికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అన్నారు.

అపుడే వారి మీద విమర్శలు చేయడం సబబు కాదని కూడా అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు తీర్చమని కోరడం కూడా తప్పు అన్నట్లుగా మాట్లాడారు. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం చేసిన తప్పులను ఆయన గుర్తు చేశారు. నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని జగన్ స్లోగన్ ఇచ్చారని వారు ఓట్లు వేసినా బాగుండేదని అంటూ వారూ వేయలేదు, మరో వైపు చూస్తే ఈ నినాదం వల్ల ఇతర సామాజిక వర్గాలకు నెగిటివ్ అయ్యామని అన్నారు.

టికెట్ల ఇష్యూతో సినీ పరిశ్రమకు వ్యతిరేకమయ్యామని చెప్పారు. మద్యం ఇసుక వంటివి ప్రభుత్వమే నిర్వహించడం తప్పు అని ప్రభుత్వం పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదు అని చెప్పారు. ఇలా చాలా చెబుతూ ఇప్పట్లో కూటమి మీద పోరాటం అనవసరం అని తేల్చారు. గరిష్టంగా చూస్తే 2024 ఏడాది క్యాలెండర్ ఇయర్ పూర్తి కావాల్సిందే అని కూడా ఒక గడువు పెట్టారు. అప్పటిదాకా కూటమిని చిన్న మాట కూడా అనకూడదని అన్నారు.

కేతిరెడ్డి చెప్పిన దాంతో సొంత పార్టీ మీద నిశిత విమర్శలు ఉన్నాయి. అవి సద్విమర్శలుగా కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంకో వైపు కూటమికి టైం ఇవ్వాలని సూచించడం ఇది కూడా చర్చనీయాంశం అవుతోంది. జగన్ అయితే పదే పదే హామీల విషయం ప్రస్తావిస్తున్నారు.

అయితే కేతిరెడ్డి చెప్పిన దానిని బట్టి ఆయన కూడా డిసెంబర్ వరకూ టైం ఇవ్వాలనే సలహా ఉంది. ఇక పోరాటాల విషయమే తీసుకుంటే ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీలో వైసీపీ ధర్నా నిర్వహించింది.

ఈ తరహా పోరాటాలు అవసరమా లేదా అన్నది అయితే చర్చగా ఉంది. సొంత పార్టీ క్యాడర్ ఇబ్బందుల్లో ఉన్నపుడు వారిని నేతలు కాపాడుకోవాలి. మరి ఆ విషయంలో కూడా కొంతమంది ఎందుకొచ్చిన పోరాటాలు అనుకుంటే బలి అయ్యేది క్యాడరే. చాలా మంది అయితే సొంత వ్యాపారాలో బిజీ అయిపోయారు అని అంటున్నారు. ఎన్నికలకు ముందు సరిగ్గా చివరి ఏడాదిలో రాజకీయంగా యాక్టివ్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.

ప్రస్తుతం కేతిరెడ్డి చెప్పినది సబబు అని చాలా మంది ఏకీభవిస్తున్నారు కూడా. ఈ నేపధ్యంలో వైసీపీలో అంతర్గతంగా నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చర్చకు వస్తోంది. క్యాడర్ డీ మోరలైజ్ అయింది. లీడర్లు అయితే ఎందుకొచ్చిన పోరాటాలు అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీని కనీసం ఈ ఆరు నెలల పాటు ఉనికి చాటుకునేలా చేయడం ఎలా అన్నది వైసీపీ హై కమాండే ఒక ఆలోచన చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అంటున్నారు.