Begin typing your search above and press return to search.

అంబటికి సీటు లేనట్టేనా.. మరో ఎమ్మెల్యే బ్రదర్‌ కు సీటు!

జగన్‌ సీటు నిరాకరించినవారిలో మొదటి నుంచి వైసీపీలో ఉన్నవారు, పార్టీకి, ఆయనకు వీర విధేయులు కూడా ఉన్నారు

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:56 PM GMT
అంబటికి సీటు లేనట్టేనా.. మరో ఎమ్మెల్యే బ్రదర్‌ కు సీటు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు ఏడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాల్లో కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు లభించగా.. మరికొందరికి సీటు నిరాకరించారు. ఇంకొందరిని పార్లమెంటు అభ్యర్థులుగా ప్రకటించారు.

జగన్‌ సీటు నిరాకరించినవారిలో మొదటి నుంచి వైసీపీలో ఉన్నవారు, పార్టీకి, ఆయనకు వీర విధేయులు కూడా ఉన్నారు. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈసారి సీటు లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరోమంత్రి, వైఎస్‌ జగన్‌ కు వీర విధేయుడు అయిన అంబటి రాంబాబుకు కూడా సీటు లేదని ప్రచారం జరుగుతోంది.

1989లో తొలిసారి గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన అంబటి రాంబాబు ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో వైసీపీ తరఫున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగి కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరిగి 2019లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసిన అంబటి గెలుపొందారు.

వైఎస్‌ జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేతలపై గట్టి వాగ్ధాటితో మాట్లాడగల నేతగా అంబటి పేరు తెచ్చుకున్నారు.

అయితే సత్తెనపల్లి నుంచి ఈసారి అంబటికి గెలుపు అవకాశాలు లేవని ఐప్యాక్‌ సర్వే తేల్చినట్టు సమాచారం. క్షేత్ర స్థాయిలో వైసీపీ క్యాడర్‌ అంబటి రాంబాబును వ్యతిరేకిస్తున్నట్టు ఐప్యాక్‌ బృందం జగన్‌ కు నివేదించినట్టు తెలుస్తోంది. ఇటీవల మరోసారి చేసిన ఆన్‌ లైన్‌ సర్వేలో కూడా అంబటికి ప్రతికూల ఫలితమే ఎదురయినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు సీటు కష్టమేనని అంటున్నారు. సత్తెనపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ వీర విధేయుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని బరిలో దింపడానికి జగన్‌ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు మాచర్ల నుంచి నాలుగుసార్లు గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సోదరుడి తరఫున గట్టి లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.

ఓవైపు ఐప్యాక్‌ సర్వేలు, మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాబీయింగ్‌ తో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సీటు ఖరారయినట్టేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోటీ చేయడానికి అంబటి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి అంబటికి సీటు దక్కుతుందో లేక పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సీటు దక్కుతుందో వేచిచూడాల్సిందే.