వైసీపీ కంచుకోట ఖాళీ !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రాయలసీమ. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు.
By: Tupaki Desk | 5 Jun 2024 9:18 AM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రాయలసీమ. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. ఒకరకంగా చెప్పాలంటే ఇది వైసీపికి వెన్నెముక. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ వెన్నెముక కూడా విరిగిపోయింది. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 శాసనసభ స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 49 స్థానాలు గెలిచింది. 2014 ఎన్నికల్లో కూడా రాయలసీమ నుంచి వైసీపీ 30 స్థానాలు గెలుచుకుంది. కానీ కూటమి ప్రభంజనంలో ఈ ఎన్నికల్లో కుప్పకూలిపోయింది.
ఈసారి రాయలసీమలోని 52 సీట్లలో వైసీపీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది. ఇక వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లను 2014లో వైసీపీ గెలిచింది. 2019 జిల్లాలోని మొత్తం 10 సీట్లను గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో ఏకంగా 7 సీట్లను ఈసారి కూటమి గెలవడం వైసీపీకి మింగుడు పడని విషయమే. కేవలం బద్వేలు, రాజంపేట, పులివెందుల లోనే వైసీపీ అభ్యర్థులు గెలవడం గమనార్హం.
ఉమ్మడి చిత్తూరులో రెండు స్థానాలు తంబళ్లపల్లి, పుంగనూరు, ఉమ్మడి కర్నూలులోని ఆలూరు, మంత్రాలయంలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఈ ఓటమి నుండి వైసీపి తేరుకోవడం ఇప్పట్లో అసాధ్యమే అని చెప్పాలి.