Begin typing your search above and press return to search.

వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు జోష్‌ పెంచేశాయి.

By:  Tupaki Desk   |   18 March 2024 9:17 AM GMT
వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇవేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు జోష్‌ పెంచేశాయి. ఓవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కూడా కూటమిగా వస్తున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఉంటాయని అంటున్నారు. రైతులకు రుణమాఫీ చేసే అంశాన్ని జగన్‌ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్‌ రూ.3 వేలను దశలవారీగా రూ.4 వేలు చేస్తామని చెబుతారని అంటున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే నాలుగు విడతల్లో రుణమాఫీ చేశారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి మరోసారి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెబుతారని అంటున్నారు. లేదా డ్వాక్రా సంఘాల మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా వడ్డీ రహిత రుణాలను అందించొచ్చని పేర్కొంటున్నారు.

రైతులకు రుణమాఫీ కష్టసాధ్యమని భావిస్తే ఇప్పుడు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఇస్తున్న రూ.13500 సాయాన్ని రూ.20 వేలకు పెంచవచ్చని చెబుతున్నారు. ఇలా పలు హామీలతో జగన్‌ మేనిఫెస్టో ఉండొచ్చని అంటున్నారు.

ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తుండటంతో జగన్‌ మేనిఫెస్టోపైనే ప్రధానంగా దృష్టి సారించారని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులను దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టో ఉండవచ్చని పేర్కొంటున్నారు.

2014లో రైతులకు రుణమాఫీ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి ఉంటే అప్పుడే వైసీపీ గెలిచి ఉండేదనే టాక్‌ ఉంది. అయితే తాను చేయగలిVó దే చెప్తాను.. చెప్పేది చేస్తానని చెప్పిన జగన్‌ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వబోనని గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న జగన్‌ మేనిఫెస్టో రూపకల్పనపైన దృష్టి సారించారని అంటున్నారు. అందులోనూ మేనిఫెస్టోను ఆయన బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తానని పలుమార్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం మేనిఫెస్టో రూపకల్పన తుది దశలో ఉందని తెలుస్తోంది. మేనిఫెస్టో రూపకల్పన పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు జగన్‌ సిద్ధమవుతున్నారు. వీటి ద్వారా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.