Begin typing your search above and press return to search.

'నవరత్నాలు +'... వైసీపీ మేనిఫెస్టోలో సంచలన హామీలు!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   27 April 2024 10:21 AM GMT
నవరత్నాలు +... వైసీపీ మేనిఫెస్టోలో సంచలన హామీలు!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 2019 మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చినట్లుగానే రాబోయే ఐదేళ్లలోనూ అంతకుమించి అన్నట్లుగా 2024 ఎన్నికల కోసం సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో... 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన విషయాలు, హామీ ఇవ్వకుండానే నెరవేర్చిన విషయాలతోపాటు 2024 తర్వాత నెరవేర్చబోయే హామీలను సవివరంగా వెల్లడించింది.

అవును... వైసీపీ - 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసింది. 2019 ఎన్నికల సమయంలో "నవరత్నాలు" అంటూ సంచలన మేనిఫెస్టోను తెరపైకి తెచ్చిన జగన్.. ఈ 58 నెలల కాలంలో వాటిలో 99శాతం హామీలు అమలు చేసిన విషయం తెలిసిందే! ఈ క్రమంలో ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తూనే వాటి పరిధిని పెంచుతూ.. సరికొత్త హామీలను ఇస్తూ కొత్త మేనిఫెస్టోను రూపొందించారు. అమలుచేయడం సాధ్యంకాని హామీలు ఇచ్చే ప్రసక్తే లేదని నిత్యం చెప్పే జగన్... వీటిని 100శాతం అమలుచేసేలా కృషిచేస్తామని వెల్లడించారు!

పెన్షన్ పెంపు:

పెన్షన్ కానుకను రూ.3,000 నుంచి రూ.3,500కు క్రమంగా పెంచుకుంటూ పోతామని జగన్ తెలిపారు. ఇందులో భాగంగా... జనవరి 2028 నుంచి రూ.250 పెంచి రూ.3,250 ఇస్తామని.. అనంతరం, జనవరి 2029 నుంచి మరో రూ.250 పెంచి రూ.3,500 ఇస్తామని స్పష్టంగా వెల్లడించారు.

మహిళల కోసం:

గడిచిన సుమారు ఐదేళ్లలో మహిళల కోసం మనసున్న నేతగా పేరు సంపాదించుకున్న వైఎస్ జగన్... తాజా మేనిఫెస్టోలోనూ వారికి పెద్దపీట వేశారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి, పండుముసలి వయసు వరకు ప్రతిఒక్కరికీ తోడుగా ఉండేలా మేనిఫెస్టోను రూపొందించారు!

ఈ క్రమంలో... "వైఎస్సార్ చేయూత" లో భాగంగా... గతంలో ఇచ్చినట్లుగానే 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు స్తూ ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో వచ్చే 5 ఏళ్లలో మరో రూ.75 వేలు ఇస్తామని తెలిపారు.

"వైఎస్సార్ కాపు నేస్తం"లో భాగంగా... కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున 4 విడతల్లో వచ్చే 5 ఏళ్లలో మరో రూ.60 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో "వైఎస్సార్ ఈబీసీ నేస్తం"లో భాగంగా... రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 45 - 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున 4 విడతల్లో వచ్చే 5 ఏళ్లలో మరో రూ.60 వేలు అందిస్తామని అన్నారు.

అదేవిధంగా... "జగనన్న అమ్మఒడి" కింద పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15వేల చొప్పున వచ్చే 5 ఏళ్లలో మరో రూ.75 వేలు అందిస్తామని.. తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ ఏటా మరో రూ.2 వేలు చొప్పున 5 ఏళ్లలో రూ.10 వేలు వారి పిల్లల స్కూళ్ల బ్యాగ్ ల కోసం ఎస్.ఎం.ఎఫ్., టీ.ఎం.ఎఫ్. రూపంలో స్కూళ్లకు జమ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

ఇదే క్రమంలో "వైఎస్సార్ ఆసరా - '0' వడ్డీ రుణాల" 2019 ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ.25,571 కోట్లను ఇచ్చిన మాట ప్రకారం 4 దఫాల్లో ఇప్పటికే చెల్లించామని చెప్పిన జగన్... రూ.3 లక్షల దాకా రుణాల మీద '0' వడ్డీ కార్యక్రమం వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగుతుందని వెల్లడించారు.

పేదలందరికీ "ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం" విషయానికొస్తే... అర్హులై ఉండి, ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, వచ్చే 5 ఏళ్లలో మిగిలిపోయిన మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఇదే సమయంలో... ఇప్పటికే ఇస్తున్నట్లుగ ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీకే రూ.35 వేల రుణం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి అందిస్తామని ప్రకటించారు!

మత్స్యకార భరోసా:

“వైఎస్సార్ మత్స్యకార భరోసా” ద్వారా ఇప్పటికే 2.43 లక్షల మందికి రూ.538 కోట్లు అందించిన విషయాన్ని వెల్లడించిన జగన్... వచ్చే ఐదేళ్లలోనూ 5 విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.50 వేలు లబ్ధి చేకూరనుందని ప్రకటించారు.

ప్రధానంగా... మత్స్యకారుల బంగారు భవితకు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇది 2019 ఎన్నికల్లో ఇవ్వని హామీ అని గుర్తుచేశారు.

వైఎస్సార్ వాహనమిత్ర (ఆటో / టాక్):

సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి “వైఎస్సార్ వాహనమిత్ర” ద్వారా ఏటా రూ.10వేల చొప్పున ఒక్కొక్కరికీ రూ.50వేలు అందించామని చెప్పిన జగన్... ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5ఏళ్లలో ఒక్కొక్కరికీ మరో రూ.50 వేలు అందిస్తామని అన్నారు. ఈ సమయంలో సొంత టిప్పర్/లారీ నడిపేవారికి కూడాఈ పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు.

వైఎస్సార్ నేతన్న నేస్తం:

“వైఎస్సార్ నేతన్న నేస్తం” ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ ఏటా రూ.24వేల చొప్పున 5 ఏళ్లలో ఇప్పటికే రూ.1.20 లక్షలు అందించామని చెప్పిన జగన్.. ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో మరో రూ.1.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో గత ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.

యువత – ఉపాధి:

క్రమం తప్పకుండా గ్రూప్ –1, గ్రూప్ – 2 మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి.. యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు! అదే విధంగా... పదో తరగతి డ్రాపవుట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇదే క్రమంలో... 5 ఏళ్లలో ఇప్పటికే 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

విద్యారంగం:

విద్యారంగంలో గత ఐదేళ్లలో సంచలన మార్పులు తీసుకొచ్చిన జగన్... వచ్చే 5 ఏళ్లలో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగిస్తూ... అన్ని ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే "మనబడి నాడు – నేడు" కొనసాగిస్తామని తెలిపారు. ఇదే సమయంలో... అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, డిగ్రీ కాలేజీల రూపురేఖలను మారుస్తామని ప్రకటించారు.

వైద్యరంగం:

వైద్యరంగం విషయానికొస్తే... 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఫలితంగా మొత్తం 2,550 ఎంబీబీఎస్ సీట్లు.. 2,737 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

ఇదే క్రమంలో హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు.. గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

ఇప్పటికే... విలేజ్ క్లినిక్‌ లు, పీ.హెచ్‌.సీ, సీ.హెచ్‌.సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు – నేడుతో అభివృద్ధి చేసిన విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా... “వైఎస్సార్ ఆరోగ్య శ్రీ” ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం ఉన్న విషయాన్ని గుర్తుచేశారు!

వ్యవసాయ రంగం:

రైతు భరోసా ద్వారా రూ.50,000 ఇస్తామని చెప్పినా... చెప్పిన దానికంటే మిన్నగా ప్రతి రైతుకు ఏటా వై”ఎస్సార్ రైతు భరోసా” ద్వారా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో ఇప్పటికే రూ.67,500 ఇచ్చామని చెప్పిన జగన్... వచ్చే ఐదేళ్లలో అదికాస్తా రూ.16,000 కు పెంచి మొత్తం రూ.80వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

వీటితోపాటు ఉచిత పంటల బీమ, సున్నా వడ్డీ పంట రుణాలు, వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్, వైఎస్సార్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు, నవరత్నాల్లో రైతులకు అమలు చేస్తున్న అన్ని పథకాలూ కౌలు రైతుకు కూడా వర్తింపజేయడం వంటివి అన్నీ రాబోయే ఐదేళ్లలోనూ కొనసాగుతాయని ప్రక్టించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం:

ఎస్సీలకు 3 (మాల, మాదిగ, రెల్లి తదితర కులాలకు) కార్పొరేషన్లు.. పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ల అమలుతో పాటు మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

క్రీస్టియన్ మైనార్టీలు:

2019 నుంచి అమలు చేస్తున్నట్లుగానే పాస్టర్లకు వివాహ రిజిస్ట్రార్ లైసెన్స్‌‌ సచివాలయ స్థాయిలోనే అప్లికేషన్, సర్టిఫికెట్ డెలివరీ అయ్యేలా సులభతరం చేసిన విషయాన్ని వెల్లడించిన జగన్... పాస్టర్లకు మొట్టమొదటిసారిగా రూ.5వేల గౌరవవేతనం.. హోలీ ల్యాండ్ వెళ్లే క్రిస్టియన్లకు సాయం చేయడం.. పాస్టర్లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు రబోయే ఐదేళ్లలోనూ కంటిన్యూ అవుతాయని ప్రకటించారు.

ఇదే సమయంలో... వచ్చే 5 ఏళ్లలో ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

బీసీ సంక్షేమం:

175 అసెంబ్లీ, 25 లోక్సభ.. మొత్తం 200 స్థానాల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 50శాతం అంటే 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే 2024 ఎన్నికల్లో కేటాయించిన విషయాన్ని వెల్లడించిన జగన్... ఇప్పటికే డీబీటీ ద్వారా రూ.1.28 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.53 వేల కోట్లు అందించిన విషయాని వెల్ల్డించారు. రానున్న ఐదేళ్లలోనూ అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయని అన్నారు!!

ఇదే క్రమంలో... దేవాలయాల్లో క్షురకర్మ చేసే నాయీ బ్రాహ్మణులకు కనీసం రూ.20 వేల గౌరవ వేతనం. ఆలయాల పాలక మండళ్లలో మొదటిసారిగా నాయీ బ్రాహ్మణులకు చోటు. నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్.. వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంశాలు గతంలోలానే రానున్న ఐదేళ్లలోనూ కొనసాగుతాయని తెలిపారు.

ముస్లిం మైనార్టీలు:

2019 నుంచి అమలుచేస్తున్నట్లుగానే... వక్ బోర్డ్, ముస్లిం మైనార్టీల ఆస్తుల రీసర్వే, పరిరక్షణ.. హజ్ యాత్రకు సాయం.. ఇమామ్లకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు పెంచిన గౌరవ వేతనం రానున్న రోజుల్లోనూ కంటిన్యూ అవుతాయని ప్రకటించారు. అదనంగా... ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

కాపు సంక్షేమం:

కాపు సంక్షేమం కోసం 5 ఏళ్లలో రూ.10వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పి.. అంతకంటే మిన్నగా ఇప్పటికే రూ.34 వేల కోట్లకుపైగా కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసినట్లు ప్రకటించారు జగన్.

ఓసీల సంక్షేమం:

2019 మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు వెచ్చించామని చెప్పిన జగన్... ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాంమని, ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చాంమని చెబుతూ... వచ్చే 5 ఏళ్ళూ వీరి సంక్షేమం ఇలాగే కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

హిందూ దేవాలయాలు:

ఇప్పటిదాకా రూ.1,376 కోట్లతో 1056 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం చేశామని చెప్పిన జగన్... అర్చకులకు రిటైర్‌మెంట్ విధానం రద్దు చేశామని, అర్చకుల వేతనాల పెంపు అమలు చేశామని తెలిపారు. ఇదే క్రమంలో వచ్చే ఐదేళ్లలో దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు.

జగనన్న తోడు:

కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు "జగనన్న తోడు" ద్వారా ఇస్తున్న రుణ పరిమితి రూ.10 వేల నుంచి రూ.15వేలకు తక్షణమే పెంచుతామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో... సక్రమంగా రుణాలు చెల్లించేవారికి ఏటా రూ.1,000 పెంపుతో వచ్చే 5 ఏళ్లలో గరిష్ఠంగా రూ.20,000 వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

జగనన్న చేదోడు:

షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా రూ.10వేల చొప్పున 5 ఏళ్లలో ఒక్కొక్కరికీ రూ.50 వేల సాయం చేసినట్లుగానే వచ్చే 5 ఏళ్లూ ఈ పథకం కొనసాగిస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగులు:

ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా.. గ్యారెంటీడ్ పెన్షన్ విధానం (జీపీఎస్) తీసుకొచ్చామని చెప్పిన జగన్... రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు ఇప్పటికే పెంచామని గుర్తు చేశారు.

ఇదే క్రమంలో... "జగనన్న విదేశీ విద్యా దీవెన"కు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు.. పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్లపాటు చెల్లిస్తామని ప్రకటించారు.

రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యానికి, ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తిస్తాయని హామీ ఇచ్చారు!

వైఎస్సార్ లా నేస్తం:

"వైఎస్సార్ లా నేస్తం" ద్వారా జూనియర్ న్యాయవాదులకు మూడేళ్లపాటు ప్రతి నెలా రూ.5 వేలు స్టైపెండ్ చొప్పున 6 నెలలకోసారి రూ.30 వేలు ఇప్పటికే ఇస్తున్న విషయాన్ని చెప్పిన జగన్... వచ్చే 5 ఏళ్లూ ఈ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో... మరిన్ని కీలక హామీలు..!:

2024లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి!

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ.

రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.

జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి.

నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం పూర్తి.

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి.

ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికీ ఐబీ సిలబస్ అమలు.