Begin typing your search above and press return to search.

ఇచ్చాపురంలో టీడీపీని ఓడించే మాస్టర్ ప్లాన్...!?

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈసారి ఆరు నూరు అయినా వైసీపీ గెలిచి తీరాల్సిందే అన్న పంతంతో ఆ పార్టీ ఉంది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:46 AM GMT
ఇచ్చాపురంలో టీడీపీని ఓడించే మాస్టర్ ప్లాన్...!?
X

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈసారి ఆరు నూరు అయినా వైసీపీ గెలిచి తీరాల్సిందే అన్న పంతంతో ఆ పార్టీ ఉంది. ఎందుకంటే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగాకా 2014, 2019లలో రెండు సార్లు టీడీపీ చేతిలో వైసీపీ ఓటమి పాలు అయింది. ఈ రెండు సార్లూ టీడీపీ తరఫున గెలిచిన బెందాళం అశోక్. ఆయన టీడీపీ తరఫున ముచ్చటగా మూడవసారి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఆయనకు ప్రత్యర్ధిగా వైసీపీ శీకాకుళం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయను రంగంలోకి దింపింది. ఇక్కడ పిరియా సాయిరాజ్ కి పట్టుంది. ఆయన బీసీ సామాజిక వర్గం నేత. 2009లో టీడీపీ తరఫున గెలిచారు. ఆయన సతీమణి విజయ మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. దాంతో ఈ రెండు సామాజిక వర్గాలు మిక్స్ చేస్తూ వైసీపీ ఇచ్చాపురం సీటుని కైవశం చేసుకోవాలని చూస్తోంది

బెందాళం అశోక్ రెండు సార్లు గెలవడం వల్ల సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. టీడీపీలో కూడా టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు. ఇపుడు వైసీపీ ఆశలు కూడా వాటి మీదనే 2014లో తొలిసారి గెలిచిన అశోక్ పాతిక వేల మెజారిటీ తెచ్చుకుంటే 2019 నాటికి దాన్ని ఏడు వేలకు వైసీపీ తగ్గించింది.

ఈసారి కచ్చితంగా తమదే విజయం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నరు. పిరియా సాయిరాజ్ సతీమణికే టికెట్ ఇవ్వడం వల్ల వైసీపీ మొత్తం పనిచేస్తారు అని నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవుల నుంచి ఎమ్మెల్సీ కోటాలో నర్తు రామారావుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దాంతో ఆ సామాజిక వర్గం కూడా తమ వెంట ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు.

వైసీపీ అధినాయకత్వం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సీటుని ఎలాగైనా గెలుచుకోవాలని పంతంతో ఉంది. ఈ సీటుని ఇప్పటికి టీడీపీ పుట్టాక ఒక్క 2004లో తప్పించి అన్ని సార్లూ గెలుచుకుంది. అంటే మొత్తం ఎనిమిది సార్లు గెలిచినట్లు అన్న మాట. అలా టీడీపీకి కంచుకోటగా మారిన ఇచ్చాపురం నుంచి జెండా ఎగరేస్తేనే అసలైన విజయం అన్నది వైసీపీ హై కమాండ్ ఆలోచనగా ఉంది. దాంతోనే వైసీపీ యంత్రాంగాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో ఒక మూల ఇంకా చెప్పాలీ అంటే ఒడిషా ఒడ్డులో ఉన్న ఇచ్చాపురం మీద గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. దాంతో ఎంవీ క్రిష్ణారావు ఏకంగా నాలుగు సార్లు గెలిచారు. బెందాళం అశోక్ రెండు సార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈసారి తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న అశోక్ ఆశలు అడియాశలు చేయాలన్నదే వైసీపీ అజెండాగా ఉంది.