Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రులు వీరేనట...?

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది.

By:  Tupaki Desk   |   30 April 2024 3:58 AM GMT
వైసీపీ మంత్రులు వీరేనట...?
X

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది. అది రాజకీయ జీవులకు అక్షరాలా సరిపోతుంది. ఎందుకంటే ముందు ఎన్నికల్లో గెలవాలి. ఆనాక తామున్న పార్టీ అధికారంలోకి రావాలి. అపుడు తమను అధినేత పిలిచి మంత్రి పదవి అప్పగించాలి. అపుడు కదా మినిస్టర్ బోర్డు తగిలించుకోవడం.

అయితే కలలకూ ఊహలకు హద్దులు ఉండవు. కొన్ని సార్లు ధీమాగా కూడా చెప్పుకునే వారు ఉంటారు. అలా చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి చాలా మందే మంత్రి రేసులో ఉన్నారని అంటున్నారు. ముందుగా చెప్పుకుంటే విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఆయన మంత్రి పదవి కోసమే ఎమ్మెల్యేగా పోటీకి దిగారు.

ఆయనకు అధినాయకత్వం నుంచి ఈ మేరకు హామీ ఉంది అని అంటున్నారు. హ్యాట్రిక్ విజేత అయిన వెలగపూడి రామక్రిష్ణ బాబుని ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే ఆయనకు ఈ టఫ్ జాబ్ అప్పగిస్తూ గెలిస్తే గిఫ్ట్ అని కూడా చెప్పారని అంటున్నారు దాంతో ఆయన వర్గం అంతా కాబోయే మంత్రి అని ప్రచారం చేసుకుంటోంది. ఇక విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి పోటీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. బలహీన వర్గాలకు చెందిన ఆయన తన సీనియారిటీకి బీసీ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని భావిస్తున్నారు అని అంటున్నారు.

గాజుగాక నుంచి మంత్రిగా ఉంటూనే పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాధ్ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన గాజువాకలో మరోసారి వైసీపీ జెండాను ఎగరవేస్తే కనుక కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుంది అని ఆయన అభిమానులు అంటున్నారు. మంత్రిగా ఉంటూ మళ్లీ మంత్రిగా ప్రమాణం చేసే నేత మా నాయకుడు అని చెప్పుకుంటున్నారు.

నర్శీపట్నంలో చూస్తే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని ఈసారి ఓడించడం అంటే బిగ్ ఫీట్ ని సాధించినట్లే. అయ్యన్నకు ఇవి చివరి ఎన్నికలు ఆయనను ఓడిస్తే కనుక అక్కడ వైసీపీ జెండా పాతుకుపోయినట్లే. అందుకే పెట్ల ఈ భారీ ఫీట్ కి సై అంటున్నారు.ఈసారి ముప్పయి వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. ఈసారి తమ నాయకుడికి సామాజిక కోటాతో పాటు నర్శీపట్నం నుంచి కోటాలో కూడా మంత్రి పదవి తధ్యమని ఆయన వర్గం అంటోంది.

అదే విధంగా చూస్తే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తాను అని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో రెండవసారి విస్తరణ మీదనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆనాడు పదవి దక్కలేదు. దాంతో ఈసారి ప్రభుత్వం వస్తే తనకే మంత్రి పదవి అని ఆయన అంటున్నారు. ఆయన వర్గం అదే చెబుతోంది బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు ఈ చాన్స్ ఉంటుందని అంటున్నారు.

ఇక షిఫ్టింగ్ మీద రాజాం నుంచి పాయకరావుపేటకు వచ్చిన కంబాల జోగులు అక్కడ కూడా వైసీపీ జెండా పాతితే మంత్రి పదవి అదే ఇంటికి వస్తుందని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జోగులు వైసీపీ నుంచి ఇప్పటికి రెండు సార్లు గెలిచారు. దాంతో ఆయన మూడవసారి కూడా గెలిస్తే మినిస్టర్ ఖాయమని అంటున్నారు. ఇలా చూస్తే కనుక అరడజన్ కంటే ఎక్కువ మందే మంత్రి పదవి కోసం వైసీపీలో ఉన్నారు. మరి కాబోయే మంత్రులు అని ప్రచారం చేసుకుంటే జనాలు అనుకూలంగా తీర్పు ఇచ్చి భారీ మెజారిటీలు ఇస్తారా అది వ్యూహమా లేక మనసులో ఆశలా లేక అదే నిజమా అన్నది తేలాలి అంటే వెయిట్ అండ్ సీ.