మంత్రిగారిని కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాల్సింది జగన్!
చిన్న అంశాల్ని భూతద్దంలో వేసి చూసే ప్రత్యర్థులు చుట్టు ఉన్నప్పుడు మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
By: Tupaki Desk | 12 Aug 2023 5:06 AM GMTచిన్న అంశాల్ని భూతద్దంలో వేసి చూసే ప్రత్యర్థులు చుట్టు ఉన్నప్పుడు మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘కేర్’ తీసుకోవాల్సిందే. ప్రత్యర్థులు తాను వేసే ప్రతి అడుక్కి అర్థం చెబుతూ.. తాను తప్పన్న భావనను క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. వారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం జగన్ మీద ఉందన్నది మర్చిపోకూడదు. తాజాగా తెర మీదకు వచ్చిన వివాదం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.
అసలేం జరిగిందంటే.. డ్వాక్రా గ్రూపు మహిళలకు సున్నా వడ్డీ సొమ్ము ఖాతాల్లోకి జమ చేయటానికి ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం అమలాపురం వచ్చారు. ప్రోగ్రాం ప్రారంభానికి ముందు మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి.. ఇతర ప్రముఖులతో కలిసి సీఎం జగన్ సందర్శించారు. ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది. స్టాళ్లను సందర్శించిన తర్వాత డ్వాక్రా మహిళలతో కలిసి ఫోటో సెషన్ నిర్వహించారు.
మహిళలతో ఫోటో తీసుకునే వేళ.. ముఖ్యమంత్రి జగన్, డ్వాక్రామహిళలకు కుర్చీలు వేశారు. వారు కూర్చున్నారు. అంతలోనే అక్కడకు వచ్చిన మంత్రి విశ్వరూప్ వారితో కలిసి ఫోటో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ఆయనే చొరవగా.. ముఖ్యమంత్రి పక్కన మోకాళ్లతో ఒంగి ఫోటోకు సిద్దమయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ వ్యవహరంలో ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి విశ్వరూప్ చొరవగా వచ్చి.. సీఎం పక్కన ఫోటో దిగేందుకు చూపిన హడావుడిలో ఫోటోలు క్లిక్ అనేశాయి.
దీనికి.. దళిత మంత్రికి అవమానం జరిగిందంటూ ప్రచారం మొదలైంది. ఇక్కడ ముఖ్యమంత్రి కంటే కూడా మంత్రి విశ్వరూప్ అత్యుత్సాహాన్ని తప్పు పట్టాలి. తన అత్యుత్సాహంతో సీఎంకు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని ఆయన గుర్తించకపోవటం తప్పుగా చెప్పాలి. అదే సమయంలో.. ఇలాంటి సన్నివేశాలకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెప్పక తప్పదు.