నందికొట్కూరు రాజకీయం గరంగరం ఆర్థర్ రూటెటు..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
By: Tupaki Desk | 11 Jan 2024 4:03 AM GMTఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక్కడి ఎమ్మెల్యేకు.. నియోజకవర్గం ఇంచార్జ్ అయిన.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి మధ్య కొన్నేళ్లుగా అస్సలు పొసగకపోవడం తెలిసిందే. ఈ విషయంపై అధిష్టానం అనేక సందర్భాల్లో సర్దుబాటు రాజకీయాలు కూడా చేసింది. అయినప్పటికీ.. సెగ-పగలతో నియోజకవర్గంలో వైసీపీ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు హాట్ గానే ఉన్నాయి. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముందు.. వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చడం.. చేర్చడం వంటి కార్యక్రమాల్లో పార్టీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నందికొట్కూరు విషయంపైనా తేల్చేసేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. అయితే.. ఈవిషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ను పక్కన పెట్టేయడం గమనార్హం. నియోజకవర్గంలో ఎవరిని నియమించాలనే విషయాన్ని పూర్తిగా సిద్ధార్థరెడ్డికే అప్పగించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆర్థర్‌కు, సిద్దార్థరెడ్డికి మధ్య పొసగని నేపథ్యంలోనే ఇలా నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీనిని బట్టి ఆర్థర్‌కు టికెట్ దక్కే అవకాశం ఏమాత్రం లేదని సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మరో నేతను ఇక్కడ సజ్జెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి కూడా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో పూర్తిగా బైరెడ్డికే ఈ నియోజక వర్గం పగ్గాలు అప్పగించారని పార్టీలో చర్చ సాగుతోంది. ఆర్థర్ విషయానికి వస్తే.. సౌమ్యుడిగాను.. ప్రజల్లో ఉండే నాయకుడిగాను పేరు తెచ్చుకున్నారు. కానీ, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆయన మాటను అధికారులు వినిపించుకోవడం లేదనే విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుకున్న విధంగా ఆయన నియోజకవర్గంలో పనిచేయలేక పోయారు.
అయితే.. ప్రజల అభిమానం విషయంలో మాత్రం ఆర్థర్‌కు మంచి మార్కులే ఉన్నాయి. దీంతో వైసీపీ కనుక ఆర్థర్‌కు టికెట్ నిరాకరిస్తే.. ఆయన స్వతంత్రంగా ఇక్కడ పోటీ చేస్తారా? అనే చర్చ కూడా తెరమీదకి వచ్చింది. అయితే.. ఆయన అంత సాహసం చేసే అవకాశం లేదని.. ఆయనకు దాదాపు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. ఏదేమైనా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం మాత్రం మరింత వేడెక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై బైరెడ్డికే నిర్ణయాధికారం వదలి పెట్టడం.. ఆయన నిర్ణయానికే సీఎం జగన్ జై కొడుతున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది.