ఆ కమ్మ వైసీపీ ఎమ్మెల్యే ఆశలు గల్లంతే...!
ఎందుకంటే..ఇప్పుడు ఆయనకు ప్రతిపక్షాల కంటే.. కూడా సొంత పార్టీ వైసీపీలోనే కాక ప్రారంభమైంది
By: Tupaki Desk | 22 Dec 2023 5:30 PM GMTమరో రెండు మాసాల్లోనే ఎన్నికల క్రతువు ప్రారంభం కానుంది. ఇప్పటికే వైసీపీలో అనేక మందిని మార్పులు, చేర్పులు చేస్తూ.. అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న బొల్లా బ్రహ్మనాయుడు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపై తీవ్రంగా మథన పడుతున్నారని తెలుస్తోంది.
ఎందుకంటే..ఇప్పుడు ఆయనకు ప్రతిపక్షాల కంటే.. కూడా సొంత పార్టీ వైసీపీలోనే కాక ప్రారంభమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే బొల్లాపై ముప్పేట దాడి జరుగుతోంది. బొల్లాకు సహకరించేది లేదని.. ఆయన సొంత సామాజిక వర్గం కమ్మలతోపాటు.. రెడ్డి వర్గం, కాపులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఒకరకంగా పెద్ద ఇబ్బందే. ఎందుకంటే.. ప్రస్తుత ఎన్నికలన్నీ కూడా సామాజిక వర్గాల సమీకరణలతోనే ముడి పడి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయా వర్గాలు బొల్లాకు దూరంగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఇక, మరోవైపు గత 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నన్నపనేని సుధ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం.. ఆమె చేయని ప్రయత్నం లేదు. ఆమె భర్త లతీఫ్ రెడ్డి.. సీఎం జగన్‌కు సన్నిహితుడు కావడంతో బొల్లా వ్యవహారంపై ఆయన ఇప్పటికే పార్టీ కీలక నేతలకు నివేదికల రూపంలో ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది.
ఇక, గత ఎన్నికల్లో బొల్లా విజయానికి కారకుల్లో ఒకరైన మక్కెన మల్లికార్జున రావు కూడా.. నిప్పులు చెరుగు తున్నారు. ఎన్నికల్లో బొల్లా గెలుపునకు తామెంతో కృషి చేశామని.. ఎన్నికలు ముగిసి.. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారని.. కానీ, నాలుగున్నరేళ్లు గడిచిపోయినా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయిందని, దీనికి బొల్లానే కారణమని మక్కెన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బొల్లాకు టికెట్ ఇస్తే.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రతిజ్ఞలు సైతం చేస్తుండడం గమనార్హం. దీంతో బొల్లాపై ముప్పేట దాడి షురూ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.