నిలదీసి..నిర్బంధించి:కోడుమూరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు.. ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు వెళుతున్న పలువురుఎమ్మెల్యేల గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Sep 2023 4:29 AM GMTఅనూహ్య పరిణామం ఎదురైంది ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు.. ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు వెళుతున్న పలువురుఎమ్మెల్యేల గురించి తెలిసిందే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సమస్యల మీద మరింత అవగాహన కలిగేందుకు వీలుగా ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే అదే రీతిలో చేపట్టిన కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా తన నియోజకవర్గం పరిధిలోని సి.బెళగళ్ మండలం పల్దొడ్డి గ్రామానికి వచ్చారు. గ్రామంలోకి అడుగు పెట్టినంతనే గ్రామస్థలు.. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆయన్ను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేపై సమస్యల వర్షం కురిపించారు. దీంతో.. ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే.. ఎక్కడా బ్యాలెన్సు తప్పకుండా.. గ్రామస్థులు చెబుతున్న సమస్యల్ని మౌనంగా విన్నారు.
తమ గ్రామానికి ఏం చేశారన్న నిలదీతతోపాటు.. రోడ్లు బాగోలేదన్న విషయాన్ని పలువురు ప్రస్తావించారు. రోడ్లపై గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్న వారు.. నిత్యం వందల సంఖ్యలో పరిమితికి మించి ఇసుక లారీలు తిరుగుతుండటంతో రోడ్డు ధ్వంసమైందని.. అధికారులు బస్సులు వేయటం లేదని.. చివరకు 108 వాహనం కూడా రావట్లేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్యల్ని పెద్ద ఎత్తున చెబుతున్న వేళ.. వారు చెప్పేదంతా మౌనంగా విన్నారు. ఈ క్రమంలో ఆయన్ను తిరిగి వెళ్లకుండా ఉండేందుకు ఆయన వాహనాలకు ఎడ్లబండ్లను.. రాళ్లను పెట్టేశారు.
దీంతో.. పోలీసులు కలుగజేసుకొని ఆయన్ను తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను గ్రామస్తులు తనతో చెప్పిన అన్నీ సమస్యల్ని పరిష్కారిస్తానని చెప్పారు. రోడ్డు బాగు చేసిన తర్వాతే మళ్లీ ఊరికి వస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాటకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.