Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో చేరిన వైసీపీ కీలక ఎమ్మెల్యే.. ఈయన ఎన్ని రోజులు ఉంటారో!

తాజాగా వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు

By:  Tupaki Desk   |   19 March 2024 2:30 PM GMT
కాంగ్రెస్‌ లో చేరిన వైసీపీ కీలక ఎమ్మెల్యే.. ఈయన ఎన్ని రోజులు ఉంటారో!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో టికెట్లు రాని నేతలు వేరే పార్టీల్లోకి జంపింగ్‌ జపాంగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల్లో సీటు దక్కని నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.

తాజాగా వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో తొగురు ఆర్థర్‌ నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బండి జయరాజుపై 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తొగురు ఆర్థర్‌ గెలుపొందారు.

అయితే నందికొట్కూరుకు తొగురు ఆర్థర్‌ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డే కొనసాగారు. ఆధిపత్యం అంతా బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి చేతిలోనే ఉండటం, బదిలీలు, తదితర వ్యవహారాలన్నింటిలోనూ ఆయన మాటే చెల్లుబాటు కావడంతో తొగురు ఆర్థర్‌ పలుమార్లు తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.

కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి నందికొట్కూరు అసెంబ్లీ సీటును వైసీపీ అధినేత జగన్‌.. డాక్టర్‌ దారా సుధీర్‌ కు కేటాయించారు. ఈయన కర్నూలు జిల్లాకే స్థానికుడు కాదు. వైఎస్సార్‌ జిల్లా నుంచి తీసుకొచ్చి నందికొట్కూరులో అభ్యర్థిగా వేశారని వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేశాయి. బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి.. నందికొట్కూరు సీటును మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామికి ఇవ్వాలని కోరినా జగన్‌ పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి.

ఇక టీడీపీ తరఫున కూడా కొత్త అభ్యర్థి జయసూర్య పోటీ చేయనున్నారు. మరోవైపు తొగురు ఆర్థర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నందికొట్కూరు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తొగురు ఆర్థర్‌ కు షర్మిల పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ఇటీవల మంగళగిరి సీటు తనకు ఇవ్వకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మళ్లీ కొద్ది రోజులకే వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో తొగురు ఆర్థర్‌ సైతం కాంగ్రెస్‌ పార్టీలో ఉంటారా, లేక ఆళ్ల మాదిరిగా మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారా అనేది తేలాల్సి ఉంది.